Employees Unions: పీఆర్సీ సాధన సమితిగా ఏర్పాటై ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ ఉద్యోగ సంఘాలు వెల్లడించాయి. ఈ మేరకు ఉదయం ఎన్జీవో హోంలో జరిగిన సమావేశానికి కొనసాగింపుగా సచివాలయ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో ఉద్యోగ సంఘాల నేతలు మరోసారి భేటీ అయ్యారు. సంప్రదింపుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమితి విషయంలో ఏవిధమైన వైఖరితో ఉండాలనే అంశంపై సమాలోచనలు జరిపారు. అనంతరం సీఎస్ సమీర్‌శర్మను కలిసి వినతి పత్రం అందించారు.
పీఆర్సీ సాధన సమితిని ఏర్పాటు చేసుకున్నట్లు సీఎస్‌కు ఉద్యోగ సంఘాల నేతలు వివరించారు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని ఉద్యోగులు, ఉపాధ్యాయులంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని స్పష్టం చేశారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలని ఉద్యోగ సంఘాల నేతలను సీఎస్ సమీర్ శర్మ కోరారు. ప్రభుత్వ తాజా నిర్ణయాల వల్ల ఉద్యోగులకు పెద్ద ఎత్తున నష్టం జరుగుతోందని నేతలు వాపోయారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా సమ్మె చేయడానికి వెనకాడబోమని సీఎస్‌కు స్పష్టం చేశారు. సోమవారం సమ్మె నోటీసు ఇస్తామని.. అందుకు సమయం ఇవ్వాలని పీఆర్సీ సాధన సమితి నేతలు సీఎస్‌ను కోరారు.
12 మంది సభ్యులతో స్టీరింగ్ కమిటీ: సూర్యనారాయణ
‘సవరించిన వేతనాలు ఇచ్చేయాలని ప్రభుత్వం ట్రెజరీ ఉద్యోగులను తొందర పెడుతోందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంఅధ్యక్షుడు సూర్యనారాయణ అన్నారు. పీఆర్సీ జీవోల అమలును నిలిపివేసి కొత్త వేతనాలు చెల్లించాలన్న ఆదేశాలను నిలుపుదల చేసి.. డిసెంబర్ నెల వేతనాలు ఇవ్వాల్సిందిగా సీఎస్‌ను కోరామని చెప్పారు. పీఆర్సీ సాధన సమితిని 12 మంది సభ్యులతో స్టీరింగ్ కమిటీగా ఏర్పాటు చేసుకుంటున్నామని వివరించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పాటు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల పెంపుపై కూడా ప్రభుత్వానికి వివరిస్తామని చెప్పారు.
అదే మా మొదటి డిమాండ్: వెంకట్రామిరెడ్డి
‘పీఆర్సీ జీవోల వల్ల ఉద్యోగులందరికీ నష్టం కలిగింది. ఈ విషయంలో అన్ని ఉద్యోగ సంఘాలు కలిసి పోరాడాలని నిర్ణయం తీసుకున్నాం. కార్యాచరణను సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. జీవోలను వెనక్కి తీసుకోవాలన్నది మా మొదటి డిమాండ్. అశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక ఇవ్వాలన్నది మా రెండో డిమాండ్. మళ్ళీ సవరించిన వేతన స్కేలు ఇవ్వాలనేది మూడో డిమాండ్. అలాగే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పెంచిన వేతన స్కేలు అమలు చేయాలని కోరుతున్నాం" - వెంకట్రామిరెడ్డి, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు
అధికారులతో వద్దు.. సీఎంతోనే చర్చలు జరపాలి - బొప్పరాజు
పాత జీతాలు కోరుతున్నాం అంటేనే మా డిమాండ్‌లో న్యాయం ఉందన్నారు అమరావతి జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు. పీఆర్‌సీ అమలును నిలిపివేసి చర్చలు మళ్లీ ప్రారంభించాలని కోరారు. అధికారులు.. మొదట్నుంచి చివరి వరకు ఒకటే మాట మాట్లాడారని.. అందుకే వారితో చర్చలు వద్దన్నామని స్పష్టం చేశారు. ఇకనుంచి సీఎం సారథ్యంలోనే చర్చలు జరపాలని విజ్ఞప్తి చేశారు.
"మేం గొంతెమ్మ కోరికలు కోరడం లేదని.. జీతం తగ్గకుండా చూడాలి. మా ఉద్యమంలోకి రాజకీయ పార్టీలకు అనుమతి లేదు. ఈ నెల పాత జీతాలే ఇవ్వాలని లికితపూర్వకంగా డిమాండ్ చేశాం. ఇది జీతాలు తగ్గించే పీఆర్సీగా ఉద్యోగులు భావిస్తున్నారు. సీపీఎస్ రద్దు చేస్తారని లక్షల మంది ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. మా మిగతా డిమాండ్లను కూడా సాధన సమితి ద్వారానే సాధిస్తాం. ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులకు నామమాత్రంగానే జీతాలు పెరిగాయి. ఆర్టీసీ ఉద్యోగులు వచ్చి మా కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఫిబ్రవరి 5న సహాయ నిరాకరణ.. 7న సమ్మెకు వెళ్లాలని నిర్ణయించాం. ఈ నెల 24న సమ్మె నోటీసు ఇవ్వాలని తీర్మానించాం. 23న అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, 25న ర్యాలీలు, ధర్నాలు.. 26న అన్ని తాలూకా కేంద్రాల్లోని అంబేడ్కర్ విగ్రహాలకు విజ్ఞాపన పత్రాలు ఇస్తాం. ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపడుతాం. పూర్తిగా శాంతియుత పద్ధతుల్లోనే మా ఉద్యమాన్ని చేపడతాం. ఉద్యగులు ఎవరూ అసభ్య వ్యాఖ్యలు చేయవద్దని కోరుతున్నాం. రాజకీయ పార్టీల ఉచ్చులో పడొద్దని ఉద్యొగులను కోరుతున్నాం’’ - ఉద్యోగ సంఘాల నేతలు
ఇదీ చూడండి