AP Employees Unions on PRC: ఉద్యోగుల నిరీక్షణకు తెరదించుతూ ఏపీ ప్రభుత్వం పీఆర్‌సీ ప్రకటించింది. గత కొన్నినెలలుగా జరుగుతున్న సుదీర్ఘ చర్చల అనంతరం ఎట్టకేలకు సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు 23.29 శాతం పీఆర్‌సీ ఇస్తున్నట్టు ప్రకటించింది. ఉద్యోగ సంఘాలతో సమావేశమైన సీఎం జగన్ ఈ మేరకు ప్రభుత్వ నిర్ణయాలను వెల్లడించారు. పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ఉద్యోగులకు ఊహించని వరమిచ్చారు. ప్రభుత్వ ప్రకటనపై ఉద్యోగ సంఘాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. పదవీ విరమణ వయస్సు పెంపును ఊహించలేదని పలువురు వ్యాఖ్యానించారు.
సర్దుకుపోతున్నాం: వెంకట్రామిరెడ్డి
Venkatram Reddy on PRC: ఏపీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సర్దుకుపోతున్నామని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. ఫిట్‌మెంట్ తప్ప మిగిలిన అంశాల్లో సంతృప్తిగా ఉన్నామని చెప్పారు. సీపీఎస్ రద్దుపై సీఎం వద్ద ఎక్కువగా చర్చ జరగలేదన్నారు.
జీతం తగ్గే ప్రసక్తే లేదు: బొప్పరాజు
Bopparaju Venkateswarlu: రెండు వారాల్లో హెల్త్ కార్డుల సమస్య పరిష్కరిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని అమరావతి ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. సీఎంతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగుల సొంతింటి కల నెరవేర్చేలా జగన్ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. స్మార్ట్ సిటీలో ఉద్యోగుల ఇంటి నిర్మాణానికి 20 శాతం రాయితీ ఇస్తామన్నారని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా ఒకటో తేదీకే జీతాలు ఇవ్వనున్నట్లు చెప్పారన్నారు. సీపీఎస్ అంశంపై టైమ్ బౌండ్ ప్రకటించారన్న బొప్పరాజు.. ఫిట్‌మెంట్ సమస్య మినహాయిస్తే.. మిగిలిన అన్ని సమస్యలపై టైమ్ బౌండ్ ప్రకటించడం మంచి నిర్ణయమని పేర్కొన్నారు.
"ఒకేసారి పెండింగ్ డీఏలన్నీ ఇస్తామన్నారు. ఈనెలలోనే పెండింగ్ డీఏలతో పాటు.. 2 వారాల్లోనే హెల్త్ కార్డులన్నీ ఇస్తామన్నారు. జీతం తగ్గే ప్రసక్తే లేదు. ఫిట్‌మెంట్ తగ్గిన మాట వాస్తవమే. మిగిలిన ప్రధాన సమస్యలకు కాలపరిమితి పెట్టారు" - బొప్పరాజు వెంకటేశ్వర్లు, అమరావతి జేఏసీ ఛైర్మన్
భవిష్యత్తులో కేంద్ర పీఆర్సీనే: చంద్రశేఖర్ రెడ్డి
ఏప్రిల్‌లోపు ప్రభుత్వం జీపీఎఫ్, మెడికల్ రీయింబర్స్‌మెంట్ ఇస్తుందని ఉద్యోగ అంశాల ప్రభుత్వ సలహాదారుడు చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. విశ్రాంత ఉద్యోగులకు ప్రయోజనాలు ఇస్తామని వివరించారు. ఈనెల 1 నుంచే ఒప్పంద, పొరుగు సేవల సిబ్బందికి కొత్త వేతనాలు అందుతాయని.. భవిష్యత్తులో కేంద్ర పీఆర్సీనే అమలు చేస్తామని వెల్లడించారు.
ఉద్యమ ఫలితమే హామీల అమలు - బండి శ్రీనివాస్
హామీల అమలు ఉద్యోగ ఐకాసల ఉద్యమ ఫలితమే. మా 71 డిమాండ్లలో 50 పరిష్కరించారు. తెలంగాణ కంటే ఏడాది ఎక్కువే విరమణ వయసు పెంచారు. ఐకాస తరఫున సీఎంకు కృతజ్ఞతలు - బండి శ్రీనివాస్ , ఏపీఎన్జోవో అధ్యక్షుడు
ఇదీచూడండి: AP PRC : ఏపీలో ఉద్యోగులకు సంక్రాంతి కానుక... పీఆర్సీ ఎంతంటే..?