విజయవాడలో నగర పాలక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచే ఓటు వేసేందుకు ప్రజలు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. 64 డివిజన్ల పరిధిలో 347 అభ్యర్థులు బరిలో ఉన్నారు. విజయవాడ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 788 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయగా.. ఎన్నికల విధుల్లో 7,500 మంది పోలింగ్ సిబ్బంది, ఒక్కో పోలింగ్ స్టేషన్‌కు 5గురు బృందంగా విధులు నిర్వహిస్తున్నారు. కార్పొరేషన్ పరిధిలో 325 సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ కేంద్రాలను అధికారులు గుర్తించారు. వైకాపా 64 డివిజన్లు, తెదేపా 57 డివిజన్లలో, సీపీఐ - 6, జనసేన 33, బీఎస్పీ 2, భాజపా 27, సీపీఎం 22, కాంగ్రెస్ 34, ఇతరులు 7, ఇండిపెండెంట్లు 94 చోట్ల పోటీ చేస్తున్నారు. నగరంలో మొత్తం ఓటర్లు 7, 81, 883 మంది కాగా మహిళా ఓటర్లు 3, 95,737 మంది, పురుష ఓటర్లు 38,623 మంది ఉన్నారని అధికారులు తెలిపారు.