ఉపరితల ద్రోణి ప్రభావంతో హైదరాబాద్ నగరాన్ని భారీవర్షం మరోమారు ముంచెత్తింది. గంట వ్యవధిలోనే కురిసిన భారీ వర్షానికి రహదారులు నీటమునిగాయి. మురుగుకాలువలు పొంగి పొర్లడంతో రహదారులు వరదనీటితో చెరువులను తలపించాయి. వనస్థలిపురం, ఎల్బీనగర్, మన్సూరాబాద్, నాగోల్, సరూర్‌నగర్, చంపాపేట్, సైదాబాద్, హయత్‌నగర్, పెద్దఅంబర్‌పేట ప్రాంతాల్లో సుమారు గంటపాటు భారీవర్షం కురిసింది.

కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం: ఈ దెబ్బకు హైదరాబాద్- విజయవాడ హైవేపై పలుచోట్ల నిలిచిన వర్షం నీరు నిలిచిపోయింది. దీనికి తోడు ఈదురు గాలులకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఏకధాటిగా కురిసిన వర్షానికి వరదనీరు రోడ్లపైకి చేరడంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద రోడ్డుపై వరదనీరు చెరువును తలపించింది. వనస్థలిపురం-హయత్‌నగర్ మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వర్షం నీరు వెళ్లేందుకు మార్గం లేక జాతీయ రహదారి చెరువును తలపించింది. కార్యాలయాలు వదిలే సమయం కావడం, దానికి వర్షం తోడవడంతో.. ఇంటికి వెళ్లేవారు ఇబ్బందులు పడ్డారు.