విజయ బ్రాండ్... ఈ పేరు వినగానే మొదట గుర్తొచ్చేది వంట నూనెలే. ప్రభుత్వ రంగ సంస్థ అయిన నూనెగింజల ఉత్పత్తిదారుల సమాఖ్య- ఆయిల్‌ఫెడ్... ఆదాయం పెంపు, స్వయం సమృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించే లక్ష్యంతో.... విజయ హైదరాబాద్ బ్రాండ్ పేరిట పలురకాల నిత్యావసర వస్తువులు అమ్మేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఈ బ్రాండ్ పేరుపై వంటనూనెలు మాత్రమే విక్రయిస్తుండగా.... ఓ ప్రైవేటు సంస్థ భాగస్వామ్యంతో నిత్యావసర సరుకులు మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. హైదరాబాద్ బేగంపేటలో ఆయిల్‌సీడ్స్ సంస్థ ఆధ్వర్యంలో 23 రకాల ఉత్పత్తులను వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఇవాళ ప్రారంభించనున్నారు. బాస్మతి బియ్యం, జొన్నపిండి, పల్లీలు, గోధుమ పిండి, కోస్తా కల్లు ఉప్పు, మసాలా టీపొడి ఇలా 23 రకాల ఉత్పత్తులు మార్కెట్లోకి రాబోతున్నాయి.
ఆదాయం పెరిగేలా..
రాష్ట్రంలోని 45 వేల అంగన్‌వాడీ కేంద్రాలుసహా... మధ్యాహ్న భోజన పథకం అమలయ్యే ప్రభుత్వ బడులు, వసతిగృహాలకు విజయ వంట నూనెలు సరఫరా అవుతున్నాయి. సరఫరా మరింత పెంచి ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతోపాటు.... సంస్థకు ఆదాయం పెరిగేలా అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా కొత్తగా హైదరాబాద్ శివారు శివరాంపల్లిలో 250 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో... ఆయిల్ ప్యాకింగ్ స్టేషన్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వద్ద మరో ప్యాకింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ఆయిల్‌ఫెడ్ సంస్థ... త్వరలోనే మెగా యూనిట్ నెలకొల్పేందుకు ప్రణాళికలు రచిస్తుంది.
400 కోట్ల లక్ష్యం నెరవేరేలాగా...
ఈ కొత్త ఉత్పత్తుల ద్వారా..... వచ్చే ఏడాది అదనంగా 200 కోట్ల లావాదేవీలు సాగించి మొత్తం 400 కోట్ల లక్ష్యం చేరుకోవాలని ఆయిల్‌ఫెడ్ సంస్థ ప్రణాళికలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేస్తోంది. త్వరలోనే కిన్నెర బ్రాండ్ పేరిట తాగునీటి బాటిల్స్ మార్కెట్‌లోకి తీసుకురానుంది. విజయ బ్రాండ్ ఉత్పత్తులకు తెలుగు రాష్ట్రాల్లో పంపిణీ వ్యవస్థ ఉండగా... కర్ణాటక, మహారాష్ట్రలోనూ వ్యాపార విస్తరణకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఇదీ చూడండి:
Afghan crisis: 'భారత్ మాకు రెండో ఇల్లు'.. అఫ్గానీల ఆనందబాష్పాలు