టీపీసీసీ కార్యదర్శి, సీనియర్ నేత నరేందర్ యాదవ్ మృతి కాంగ్రెస్ పార్టీకి తీరనిలోటని నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ అన్నారు. కరోనా వైరస్ సోకి చికిత్స పొందుతూ నరేందర్ యాదవ్ మృతి చెందారని అంజన్‌కుమార్ యాదవ్ వెల్లడించారు. గాంధీభవన్‌లో నరేందర్ యాదవ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. కరోనాతో చనిపోయిన నరేందర్ యాదవ్ మృతదేహాన్ని గాంధీభవన్‌కు తీసుకురాలేకపోయామని విచారం వ్యక్తం చేశారు.
గతంలో టెలిఫోన్, రైల్వే బోర్డు అడ్వయిజరీ కమిటీ మెంబర్‌గా నియమితులైన నరేందర్ యాదవ్ ప్రజలకు పార్టీకి చేదోడు వాదోడుగా నిలిచారని వివరించారు. కార్యక్రమంలో నాంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ఫిరోజ్‌ఖాన్‌తోపాటు ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు.