వారం అనంతరం ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోని తన ఇంటికి వచ్చిన ఆనందయ్యను అదుపులోకి తీసుకోవడానికి శుక్రవారం సాయంత్రం పోలీసులు రాగా స్థానికులు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేసి అడ్డుకున్నారు. దీంతో శనివారం వేకువజామున వచ్చి కృష్ణపట్నం పోర్టులోని సెక్యూరిటీ ( krishnapatnam port academy) అకాడమీకి భారీ బందోబస్తు మధ్య ఆనందయ్యను తరలించారు. ఎక్కడికీ వెళ్లనని బహిరంగంగా ప్రకటించినా.. భద్రత కోసం సురక్షిత ప్రాంతంలో ఉండాలని డీఎస్పీ హరినాథ్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఔషధం తయారుచేసి అందరికీ అందిస్తానని ఆనందయ్య చెప్పారు.
కృష్ణపట్నంలో అయిదుగురికి ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్ (corona positive) వచ్చినట్లు స్థానిక పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు. వీరందరూ ఆనందయ్య మందు పంపిణీలో భాగస్వాములని చెప్పారు.
'ఎందుకు నిర్బంధించారో చెప్పాలి'
రెండు తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్ వాస్తవ మరణాలను గుర్తించాలని, ఈ విషయాన్ని బీసీ కమిషన్ సీరియస్‌గా తీసుకుంటుందని జాతీయ బీసీ కమిషన్ ( National BC Commission) సభ్యుడు ఆచారి తలోజి అన్నారు. శనివారం ఆయన నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో పర్యటించారు. ఆనందయ్య ఇస్తున్న మందుతో చాలామందికి ఆరోగ్యం మెరుగైందన్నారు. ఆనందయ్యను పదేపదే ఇబ్బందులు పెడుతుంటేనే.. హైకోర్టులో పిటిషన్ వేశారని చెప్పారు.
జిల్లా అధికారులు ఆయన్ను కుటుంబసభ్యుల నుంచి దూరంగా పెట్టడం, నిర్బంధించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ మందును ప్రసాదంలా అందరికీ పంపిణీ చేసేలా సీఎం జగన్ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆనందయ్యను ఎందుకు నిర్బంధిస్తున్నారో కమిషన్‌కు జవాబు చెప్పాలని, ఆయన్ను నిర్బంధించినవారిపై కమిషన్ చర్యలు తీసుకుంటుందని తలోజీ స్పష్టం చేశారు.
ఆనందయ్య మందుపై దిల్లీకి నివేదిక
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య పంపిణీ చేసే మందు పనితీరుపై చేసిన అధ్యయన నివేదికను వైద్య బృందాలు దిల్లీలోని కేంద్ర ఆయుర్వేద పరిశోధన సంస్థకు ఆన్‌లైన్‌లో పంపించాయి. తిరుపతి ఆయుర్వేద వైద్యకళాశాల, విజయవాడ ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థలు సేకరించిన సమాచారాన్ని నివేదిక రూపంలో దిల్లీకి సమర్పించాయి. అక్కడి వైద్య బృందం నివేదికను పరిశీలించి, తన అభిప్రాయాన్ని తెలియచేస్తుంది. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టులో(Ap High Court) సోమవారం మందు పంపిణీపై విచారణ జరగనుంది.
ఇవీచూడండి: Anandaiah Medicine: ఆనందయ్య మందు నివేదికలో ఏముంది..!