ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన మొత్తం ప్రస్తుతం అమరావతి నుంచే సాగుతోంది. శాసనసభ, శాసనమండలి సమావేశాలు అమరావతిలోనే జరుగుతున్నాయి. సచివాలయం అమరావతి నుంచే పనిచేస్తోంది. హైకోర్టు కూడా అక్కడే ఉంది. డీజీపీ సహా కొన్ని విభాగాధిపతుల కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించారు. హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసుల అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులకు పెద్ద ఎత్తున గృహ నిర్మాణం చేపట్టారు. ఇప్పటికే చాలావరకు పూర్తైన ఈ భవనాల నిర్మాణం కొనసాగిస్తే కొద్దిరోజుల్లోనే అందుబాటులోకి వస్తాయి. ఇదీ సూక్ష్మకంగా రాజధాని అమరావతి ప్రాంతంలోని పరిస్థితి.
రాజ్ భవన్ ఠీవి
విజయవాడలోని జలవనరుల శాఖకు చెందిన భవనాన్ని, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంగా సేవలందించిన భవనాన్ని రాజ్ భవన్‌గా మార్చారు. సుమారు 60 వేల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతం కలిగిన ఈ భవనాన్ని రాజ్ భవన్‌గా సర్వహంగులతోనూ తీర్చిదిద్దారు. ప్రస్తుతం మొదటి అంతస్తులో గవర్నర్ నివాసం, దిగువ అంతస్తులో గవర్నర్ ఛాంబర్, దర్బార్ హాల్, కార్యాలయం ఏర్పాటు అయ్యాయి. కొత్త రాజ్ భవన్ నిర్మించేంతవరకూ ఇక్కడి నుంచే పాలన కొనసాగించే అవకాశముంది.
అన్ని హంగులతో హైకోర్టు
ఇక అమరావతిలోని పరిపాలనా నగరంలో నిర్మించిన మరో భవనం హైకోర్టు. రాజస్థాన్ నుంచి తెప్పించిన ప్రత్యేకమైన ఇసుకరాతి పలకల్ని తాపడం చేసి ఈ భవనాన్ని నిర్మించారు. ఐకానిక్‌గా నిర్మించిన ఈ భవనం నుంచే 2018 ఫిబ్రవరి 3 నుంచి హైకోర్టు పనిచేస్తోంది. 48 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనంలో 28 కోర్టు హాళ్లున్నాయి. హైకోర్టుకి మరో పెద్ద భవనం కట్టేందుకు ప్రస్తుతం డబ్బుల్లేవనుకుంటే ఈ భవనం పైనే మరో 2అంతస్తులు నిర్మించుకునే అవకాశముంది. హైకోర్టు సిబ్బంది కోసం వివిధ సెక్షన్లు,రిజిస్టీలు,లైబ్రరీ,న్యాయవాదుల సంఘం హాలు, ప్రత్యామ్నాయ వివాద పరిష్కారం కేంద్రం, వంటి అన్ని సదుపాయాలున్నాయి.
సౌకర్యాల నిలయం సచివాలయం
ఇక అమరావతిలో నిర్మించిన మరో కీలక భవన సముదాయం సచివాలయం. వెలగపూడిలో జీ ప్లస్ వన్ ప్రాతిపదికన నిర్మించిన ఈభవనాల్లో సచివాలయం విధులు నిర్వహిస్తున్నారు. పూర్తిగా సెంట్రలైజ్ ఏసీ, ఆధునిక వర్క్ స్టేషన్లు, సమావేశ మందిరాలు, చాంబర్లతో సౌకర్యవంతంగా నిర్మించారు. సచివాలయ ప్రాంగణాన్ని ఆనుకునే నిర్మించిన శాసనసభ, మండలి భవనాలు కూడా ప్రస్తుతం పనిచేస్తున్నాయి. 2017 మార్చి 2న దీన్ని ప్రారంభించారు. ఆ ఏడాది బడ్జెట్ సమావేశాలతో మొదలు పెట్టి ఇప్పటివరకూ శాసనసభ, మండలి సమావేశాలు కొనసాగుతూనే ఉన్నాయి. శాసనసభ, శాసనమండలి సమావేశ మందిరాల్ని అధునాతన ఫర్నిచర్, మైక్ సిస్టమ్‌తో తీర్చిదిద్దారు. అసెంబ్లీ, సచివాలయ భవనాలను మొత్తం 15 ఎకరాల్లో అభివృద్ధి చేశారు. ఇకపైనా ఇక్కడే శాసనసభ, శాసనమండలి సమావేశాల నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది లేదు.
ప్రస్తుతం ఉన్న సచివాలయం పొరుగునే కాల్ సెంటర్ నిర్వహణ కోసం 3వేల మంది ఉద్యోగులు కూర్చునేలా 20 వేల చదరపు అడుగుల కార్యాలయం కూడా ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఈ భవనం పూర్తైతే ప్రస్తుతం గుంటూరు , విజయవాడలో ఉన్న విభాగాధిపతుల కార్యాలయాలన్నీ సచివాలయం వద్దకే తీసుకెళ్లేందుకు వీలుంటుందన్నది నిపుణుల అభిప్రాయం.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అధునాతన భవన సముదాయాలు
ఇక హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసు అధికారులు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్, నాలుగో తరగతి ఉద్యోగుల కోసం పాలనా నగరంలో పెద్ద ఎత్తున గృహనిర్మాణాలు చేపట్టారు. దాదాపు 80 శాతం మేర నిర్మాణాలు కూడా పూర్తయ్యాయి. కొద్దిపాటి నిధులతోనే వాటిని పూర్తి చేస్తే వారు నివాసముండేందుకూ అవకాశముంది. న్యాయమూర్తుల కోసం 38 బంగ్లాలు, మంత్రుల నివాసాల కోసం 35 బంగళాలు నిర్మాణంలో ఉన్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాసం ఉండేందుకు 288 యూనిట్లు...అఖిలభారత సర్వీసు అధికారుల కోసం 144 యూనిట్ల నిర్మాణం చేపట్టారు. ఈ భవనాలు 70 శాతం వరకూ పూర్తయ్యాయి.
పాలనా వ్యవస్థలోని ప్రధానవిభాగాలన్నీ ఇప్పటికే కొలువు తీరినప్పుడు,సౌకర్యవంతంగా పాలన సాగుతున్నప్పుడు ఇకపైనా అమరావతి నుంచే పాలన కొనసాగించడానికి అభ్యంతరమేమిటన్నది అసలు ప్రశ్న. ఉన్న ఫలనా పాలనా వ్యవస్థను మరో చోటుకి తరలించాలనుకోవడంలో అర్ధమేంటన్నది అంతటా చర్చనీయాంశం అవుతున్న మాట. ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవనుకుంటే అదనంగా ఒక్క ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఇప్పుడున్న వసతుల్లోనే పరిపాలన కొనసాగించే అవకాశం ఉంది. రాజదానికి లక్ష కోట్లు ఖర్చవుతుందని..నిధుల్లేవంటూ ప్రభుత్వం చెబుతున్నా.. ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్నది నిపుణుల అభిప్రాయం.
ఇదీచదవండి ఇది జగన్‌కు... జనానికి మధ్య జరుగుతున్న యుద్ధం:ఐకాస