ఏపీలో అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పంట భూములు పోయి.. పనులు లేకుండా పోయాయి. అటు అమరావతి అభివృద్ధీ ఆగిపోయింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన కౌలు సకాలంలో అందని కారణంగా.. ఏపీ రాజధాని రైతు కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయి. ఈ తరుణంలో కుటుంబ పోషణ కోసం కొందరు మహిళలు ఇళ్లల్లోనే చిరుతిళ్లు, పిండివంటలు, పచ్చళ్లు తయారు చేసి విక్రయిస్తున్నారు.
స్థానికులకే కాకుండా.. ఇతర రాష్ట్రాలు, విదేశాలకు పంపిస్తున్నారు. అది కూడా తమ జీవన నినాదమైన అమరావతి బ్రాండ్‌పైనే విక్రయాలు జరపడం విశేషం. ప్రస్తుతం సంక్రాంతి సీజన్ కావడం వల్ల తెలుగు వంటలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఏర్పడింది. మహిళలు బృందాలుగా ఏర్పడి ఈ పిండివంటలు తయారు చేస్తున్నారు. జై అమరావతి నినాదాలతో కూడిన స్టిక్కర్లను అంటించి విక్రయిస్తున్నారు. తమ ఆర్థిక స్వావలంబనతో పాటు అమరావతి ఉద్యమానికి తోడ్పాటు అందించేందుకు ఈ పిండివంటల తయారీని చేపట్టినట్లు మహిళలు చెబుతున్నారు.
విదేశాల్లో డిమాండ్...
ఏపీ రాజధాని పోరాటానికి కొందరు ప్రవాసాంధ్రులు విరాళాల రూపంలో సహకరిస్తే.. మరికొందరు ఉద్యమకారులు తయారు చేసిన పిండివంటలు కొనుగోలు చేయటం ద్వారా వారికి తోడ్పాటు ఇస్తున్నారు. అరిసెలు, జంతికలు, చక్రాలు, చెక్కలు, చగోడీలు, కారప్పూస వంటి చిరుతిళ్లకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. అలాగే పచ్చళ్లు కూడా కావాలని కోరుతున్నారు. అమరావతిలో రాజధాని ఉండాలని కోరుకునే తెలుగువారు ఎక్కువగా ఆర్డర్లు ఇస్తున్నట్లు మహిళలు తెలిపారు.
ఉద్యమానికి సమయం కేటాయిస్తూనే... ఉదయం, సాయంత్రం వేళల్లో వంట కార్యక్రమాలు చేపడుతున్నారు. ఓవైపు అమరావతి పోరాటం.. మరోవైపు దానికి కావాల్సిన ఆర్థిక వనరుల సమీకరణకు పిండివంటలు తయారు చేస్తున్నారు ఏపీ రాజధాని మహిళలు.
- ఇదీ చదవండి : శరీర ప్రకృతిని అనుసరిస్తేనే ఆరోగ్యం