తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌ను.. ఏపీ రాజధాని రైతు జేఏసీ సభ్యులు మహా పాదయాత్రకు ఆహ్వానించారు. విజయవాడలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన్ను కలిసి ఆహ్వానపత్రిక అందజేశారు. రైతుల పాదయాత్రకు ప్రొ.కోదండరాం పూర్తి మద్దతు తెలిపారు. "రాజధాని అమరావతిపై గతంలో ఓ నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారం రైతులు భూములిచ్చారు. రైతుల ప్రమేయం లేకుండానే అమరావతి తరలింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం సరికాదు" అని తెజస అధ్యక్షుడు వ్యాఖ్యానించారు. రైతులతో చర్చించి సమస్యలు పరిష్కరించే విధంగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. సమయం చూసుకుని.. వీలుంటే తాను ఓ సారి పాదయాత్రలో పాల్గొంటానని చెప్పారు.
ప్రభుత్వ ఆస్తులు విక్రయించడం రాజ్యంగ విరుద్ధం..
ప్రభుత్వ ఆస్తులు విక్రయించటం రాజ్యాంగ విరుద్ధమని ప్రొ.కోదండరామ్ అన్నారు. ప్రమాదంలో ప్రజాస్వామ్యం పౌరహక్కులు అనే అంశంపై ఎంపీజె, ఏపీసీఆర్ సంస్థల ఆధ్వర్యంలో విజయవాడలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వ సంపదను ప్రజల అభివృద్ధికి వినియోగించాలన్నారు. ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని.. దానివల్ల వచ్చే అనర్థాలు చాలా తీవ్రంగా ఉంటాయన్నారు. ఇప్పటికే చాలామందికి విద్య, వైద్యం అందటం లేదని చెప్పారు.
ఇదీ చదవండి: DGP ON AMARAVATHI: అమరావతి రైతుల పాదయాత్రకు అనుమతి..కానీ