ఇంజినీరింగ్ తుది విడత సీట్లు కేటాయింపు(engineering seat allotment 2021) పూర్తైంది. విద్యార్థులకు సీట్లు కేటాయించినట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 60,941 ఇంజినీరింగ్ సీట్లు కేటాయింపులు జరిగాయి. కన్వీనర్ కోటాలో మొత్తం సీట్లు 79,790 ఉండగా.. 59,993 సీట్లు భర్తీ అయ్యాయి. 19,797 సీట్లు ఖాళీగా ఉన్నాయి. 1861 మంది విద్యార్థులకు ఏ సీటూ లభించలేదు.
కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల(EWS reservations) ద్వారా 4,973 మంది సీట్లు పొందారు. ఇంజినీరింగ్ కళాశాలలకు సంబంధించి 15 కళాశాలల్లో సీట్లన్నీ భర్తీ అయ్యాయి. ఇందులో విశ్వవిద్యాలయ కళాశాలలు మూడు ఉండగా... మిగతావి 12 ప్రైవేట్ కళాశాలలు. ఒక ఇంజినీరింగ్ కళాశాలలలో ఒక్క ప్రవేశం కూడా నమోదు కాలేదు.
ఇంజినీరింగ్లో కంప్యూటర్ సైన్స్(Compute science course), ఐటీ(Information technology) కోర్సులకు భారీగా స్పందన ఉంది. ఈ విభాగంలో 89.89 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. సీఎస్ఈ(Compute science course)లో 95.98 శాతం, ఐటీలో 94.13 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. సీఎస్ఈ-ఏఐ, ఎంఎల్లో 85.68 శాతం, డేటాసైన్సులో 91.52 శాతం సీట్లు కేటాయించారు. ఐటీ కోర్సులో 94.13 శాతం భర్తీ అయ్యాయి. సివిల్, మెకానికల్, ఈఈఈ కోర్సులకు ఆదరణ తగ్గింది.
మెకానికల్లో 32.57 శాతం, సివిల్లో 41.87, ఈఈఈలో 46.14 శాతం, ఈసీఈలో 77.46 శాతం సీట్లను కేటాయించారు. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజినీరింగ్, ఆటోమేషన్-రోబోటిక్స్, ఈటీఎం, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, సీఐటీ, మెటలర్జీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ కోర్సుల్లో ఒక్క సీటు కూడా కేటాయించలేదు. ఫార్మా కోర్సుల్లో ఎంపీసీ అభ్యర్థుల కోటాకు స్పందన కరువైంది.
ఫార్మసీ కోర్సుల(Pharmacy)కు కన్వీనర్ కోటాలో మొత్తం 4,426 సీట్లకుగాను 221 మందికి సీట్లు కేటాయించారు. 4205 సీట్లు ఖాళీగా ఉన్నాయి. సీట్లు వచ్చిన విద్యార్థులు ఈనెల 15లోగా ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. మొదటి రౌండ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన వాళ్లు కూడా మళ్లీ చేయాలని స్పష్టం చేశారు. సీట్లు రద్దు చేసుకోవాలనుకునే వారికి ఈ నెల 18వ తేదీ వరకు అవకాశం ఉందని వెల్లడించారు.