కరోనా కట్టడి చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా అన్ని రైళ్లను రద్దుచేసినట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. మార్చి 31 అర్ధరాత్రి వరకు అన్ని ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్, మెయిల్, సబర్బన్, డెమో, ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్, ఎంఎంటీఎస్, ఇతర ప్రత్యేక రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
అందుబాటులో ఐఆర్సీటీసీ..
సాధారణ టికెట్ బుకింగ్ కౌంటర్లు, రిజర్వేషన్ కౌంటర్లు, పార్సిల్, ఆహార బండాగారాల వంటివన్నీ మూసివేస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. రైళ్లు రద్దు చేయడం వల్ల యూటీఎస్ చరవాణి యాప్ పనిచేయదని.. కేవలం ఐఆర్సీటీసీ పోర్టల్, అప్లికేషన్ మాత్రమే పనిచేస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్ రిజర్వేషన్ల కోసమే అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రీఫండ్ విషయంలో ప్రయాణికులు చింతించాల్సిన అవసరంలేదని జూన్ 21 వరకు నగదు తీసుకునే వెసులుబాటు కల్పించామని రైల్వే అధికారులు వెల్లడించారు. సరకు రవాణా రైళ్లు (గూడ్స్) మాత్రం యథావిధిగా నడుస్తాయన్నారు.
ఏ వాహనాలూ నడవకూడదు..
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులను డిపోలకే పరిమితం చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వీటితో పాటు ప్రైవేటు బస్సులనూ నిలిపివేస్తున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆటోలు, క్యాబ్‌లు, ప్రైవేట్ వాహనాలకు అనుమతిలేదన్నారు. రవాణా వ్యవస్థను స్తంభింపజేయడం ద్వారా.. ప్రజలు పూర్తిగా ఇళ్లకే పరిమితమవుతారని అధికారులు అభిప్రాయపడుతున్నారు. మెట్రో రైళ్ల రద్దును ఈనెల 31 వరకు పొడిగించినట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
ఇవీచూడండి: మార్చి 31 వరకు తెలంగాణ లాక్‌డౌన్