జనాభా గణనలో బీసీ కులాల లెక్కలు తీయాలని కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి ఈ నెల 31న దిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ప్రవేశపెట్టిన ఈ తీర్మానం ఆమోదానికి కేంద్రంపై ఒత్తిడి తెస్తామని అన్నారు. అక్కడి కాన్‌స్టిట్యూషనల్ క్లబ్‌లో నిర్వహించే సమావేశానికి మాజీ ప్రధాని దేవెగౌడ, రాహుల్‌గాంధీ, అఖిలేశ్‌యాదవ్, తేజస్వీయాదవ్, మాయావతి తదితరులు హాజరవుతారని చెప్పారు. సోమవారం హైదరాబాద్ కాచిగూడలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు లాల్‌కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో 50 శాతం వెనకబడిన తరగతుల ప్రజలు ఉన్నారని... వారికి అనేక రంగాల్లో న్యాయం జరగాల్సి ఉందని కృష్ణయ్య అన్నారు. బీసీ కుల గణన చేయాలని చాలా రాష్ట్రాల్లో కూడా విజ్ఞప్తులు ఉన్నాయని.. తెలంగాణలో అది కార్యరూపం దాలుస్తుండటం సంతోకరమైన విషయమని చెప్పారు. పేదల్లో అత్యంత పేదలను ఆదుకోవాలంటే బీసీ కులాల వారీగా కచ్చితమైన గణాంకాలు అవసరమని అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 2021 సంవత్సరంలో జనాభా లెక్కలను నిర్వహించబోతున్నందున... అందులో భాగంగా బీసీల గణనను కూడా చేయాలనే తెలంగాణ సర్కార్ తీర్మానానికి కేంద్రం ఆమోదం తెలపాలన్నారు.