జనసేన ఆవిర్భావ సభలో జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చబోమన్న పవన్ వ్యాఖ్యలకు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం మద్దతు పలికింది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకపోతే వైకాపా నేతలకు డిపాజిట్లు కూడా రావని తెదేపా నేతలు ఎద్దేవా చేశారు. రాక్షస పాలన అంతమవ్వాలంటే అంతా కలసికట్టుగా పోరాడాలన్న పవన్ మాటలతో ఏకీభవిస్తున్నామని చెప్పారు. పొత్తుల విషయం అధిష్ఠానం చూసుకుంటుందని స్పష్టం చేశారు.
రెండు నెలల క్రితమే రోడ్‌మ్యాప్
భాజపా రోడ్‌మ్యాప్ కోసం వేచిచూస్తున్నానన్న పవన్ వ్యాఖ్యలపై ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. రెండు నెలల క్రితమే అమిత్ షా రోడ్‌మ్యాప్ ఇచ్చారని సోము వీర్రాజు వెల్లడించారు.
ఆ ఉద్దేశంతోనే పవన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఉంది
పవన్ వ్యాఖ్యలపై అందరూ సానుకూలంగా ఆలోచించాలని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు సూచించారు. జనసేన, భాజపా, తెలుగుదేశం కలిస్తే ప్రజలకు మంచి జరుగుతుందన్న ఉద్దేశంతోనే పవన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఉందని అభిప్రాయపడ్డారు. రోడ్‌మ్యాప్ అందిందన్న సోము వీర్రాజు వ్యాఖ్యలపైనా రఘురామ స్పందించారు.
పొత్తు పెట్టుకుని రాష్ట్రానికి ఏం సాధించారు
భాజపాతో పొత్తు పెట్టుకుని రాష్ట్రానికి ఏం సాధించారని పవన్‌ను వైకాపా నేతలు నిలదీశారు. ఏ వైకాపా నేతలు గుండాగిరీ చేశారో చెప్పాలని ప్రశ్నించారు. సభలో తమను ఉద్దేశించి పవన్ వ్యాఖ్యలు చేయడంపై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు.