నూతన వ్యవసాయ చట్టాలు కార్పోరేట్లకు మేలు చేసేలా... రైతులకు ఉరితాళ్లు బిగించే విధంగా ఉన్నాయని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్ అన్నారు. హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని ఎస్ఎన్ రెడ్డి భవన్లో నిర్వహించిన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకునే వరకు కార్మికులు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. చట్టాలను ఉపసంహరించుకోవాలని పార్లమెంట్లో విపక్షాలు డిమాండ్ చేసినా... ప్రభుత్వం మొండి వైఖరితో ఆమోదించిందని ధ్వజమెత్తారు.
రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆగదని ఆమె తేల్చి చెప్పారు. రైతులు దిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉద్యమిస్తుంటే... ఖలిస్తాన్ వాదులుగా, టెర్రరిస్టులుగా అమిత్ షా చిత్రీకరించడం సిగ్గుచేటన్నారు. కార్పోరేట్ శక్తుల చేతుల్లోకి వ్యవసాయరంగం పోతే... ఆహార భద్రత ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకంగా గత జూన్ నుంచే రైతులు నిరసనలు తెలుపుతున్నారని... ఫిబ్రవరి 2న దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని పిలుపునిచ్చారు. రైతు, కార్మిక వ్యతిరేక విధానాలు ఉపసంహరించుకునే వరకు పోరాటాలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: 'సాగు సెగ' మధ్య పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు