తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు కేసీఆర్, కేటీఆర్‌లు కుట్ర చేస్తున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. పీఆర్సీ కేసీఆర్ ఇచ్చే భిక్ష కాదని... ఉద్యోగుల హక్కని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో 27 శాతం ఇస్తే 29 శాతం ఇస్తామని కేసీఆర్ ప్రకటించడంపై కొందరు ఇందుకు సంబురాలు చేసుకుంటున్నారని... ఇది మోసం కాదా అని ప్రశ్నించారు. గతంలో 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చారని ఇప్పుడు 45 శాతం ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు ఎందుకు డిమాండ్ చేయడం లేదని నిలదీశారు.
కాంగ్రెస్ హయాంలోనే..
ఇప్పటికైనా సీఎం కేసీఆర్ 45 శాతం ఫిట్మెంట్ ఇచ్చి, ఉద్యోగుల అన్ని సమస్యలను పరిష్కారించేందుకు ముందుకొస్తే తాము ఎన్నికల నుంచి తప్పుకుంటామని ఆయన సవాల్ విసిరారు. ఎన్నికలు రాగానే కేసీఆర్‌కు అబద్ధాలు వస్తాయని, హైదరాబాద్‌లో మంచి నీళ్ల కోసం కొట్లాడుకునే వాళ్లు.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని కేటీఆర్ అనడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలోనే కృష్ణ, గోదావరి నదుల నుంచి పుష్కలంగా నీరు అందించి నగర ప్రజల దాహార్థి తీర్చినట్లు ఆయన వివరించారు.
ఇప్పుడేం విచారణ జరుపుతారు
మండలి ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను ఓడిస్తే వాళ్లు ప్రభుత్వం పడిపోదని... కానీ కేసీఆర్, కేటీఆర్ అబద్ధాలు మాని ప్రజలకు ప్రధానంగా నిరుద్యోగులు, పట్టభద్రులకు న్యాయం జరుగుతుందన్నారు. రెండు రోజుల్లో ఎన్నికలు ఉండగా ఇప్పుడు బోగస్ ఓట్లపై ఎన్నికల కమిషన్ విచారణకు ఆదేశించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ రెండు రోజుల్లో ఏం విచారణ జరుపుతారు....ఏం చర్యలు తీసుకుంటారని నిలదీశారు.
ఇదీ చదవండి : లైవ్ వీడియో: కోతుల నుంచి తప్పించుకోబోయి విద్యార్థిని మృతి