ఏపీ, తెలంగాణల మధ్య అంతర్రాష్ట్ర ఆర్టీసీ సర్వీసుల సమస్య ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రెండు రాష్ట్రాల ఆర్టీసీలు ఏయే మార్గాల్లో ఎన్ని సర్వీసులు నడపాలో స్పష్టత వచ్చింది. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో అవగాహన ఒప్పందంపై ఇరు రాష్ట్రాల ఆర్టీసీ ఎండీలు సంతకాలు చేశారు. దీని ప్రకారం ఏపీలో 1,61,258 కి.మీ. మేర టీఎస్ ఆర్టీసీ బస్సులు తిరగనున్నాయి. ఇక తెలంగాణలో 1,60,999 కి.మీ. మేర 638 బస్సులను ఏపీఎస్ ఆర్టీసీ నడపనుంది.
"మార్చి 22న కరోనా కారణంగా ఇరు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సేవలు నిలిచిపోయాయి. రాష్ట్ర విభజన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్ర నిబంధనల ప్రకారమే బస్సులు నడిపాం. ఇప్పుడు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల ఒప్పందం ప్రకారం ఆర్టీసీ బస్సులు నడపబోతున్నాం. ఆర్టీసీతో పాటు గూడ్స్ ఇతర రవాణా వాహనాలు పునరుద్ధరిస్తాం. త్వరలోనే ఇంటర్ స్టేట్ టాక్స్ పేమెంట్ కోసం ఇరు రాష్ట్రాల మంత్రుల భేటీ ఉంటుంది. రెండు రాష్ట్రాలు కలిసి పనిచేయాలని అంటే స్పిరిట్ ఆఫ్ స్టేట్ ఉంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరు రాష్ట్రాలు 1లక్ష కిలోమీటర్లు నడపాలంటే కష్టమే. ఎందుకంటే కరోనా పరిస్థితులు చక్కబడి సాధారణ స్థితికి రావడానికి మరో ఆరు నెలల సమయం పట్టవచ్చు. ఒక వేళ లక్ష కిలోమీటర్లు ఇరు రాష్ట్రాలు తిప్పకపోతే మళ్లీ పునరాలోచన చేయాల్సి ఉంటుంది. ప్రజలకు అసౌకర్యం కలగకుండా బస్సులను నడపాలని ఇరు రాష్ట్రాలు ఒప్పందం చేసుకుంటున్నాము"
- ఎండీ కృష్ణబాబు, ఏపీఎస్‌ఆర్టీసీ
టీఎస్‌ఆర్టీసీ ఛార్జీలు పెంచే యోచన లేదు
లాక్‌డౌన్‌కు ముందు ఏపీఎస్‌ఆర్టీసీ తెలంగాణకు నిత్యం 1,009 సర్వీసులు నడిపేది. ఇప్పుడు ఆ సంఖ్య 638కే పరిమితమైంది. దీంతో 371 సర్వీసులు తగ్గనున్నాయి. టీఎస్‌ఆర్టీసీ గతంలో ఏపీకి 750 సర్వీసులు నడిపేది. ఇప్పుడు 820 వరకు పెరగనున్నాయి. టీఎస్‌ఆర్టీసీ డిమాండు మేరకు 1.61 లక్షల కి.మీ.మేర సర్వీసులకే ఏపీఎస్ ఆర్టీసీ అంగీకరించడంతో ఆర్టీసీల ఎండీల మధ్య సోమవారం ఒప్పందం జరిగింది. అయితే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు బస్సుల పర్మిట్లపై గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి, ఉభయ రాష్ట్రాల రవాణాశాఖల ముఖ్య కార్యదర్శుల మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందం జరిగేందుకు మరికొంత సమయం పడుతుందని ఏపీ ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు, టీఎస్ ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ తెలిపారు.
"సమయం తీసుకున్నా... సమగ్రమైన అవగాహన ఒప్పందం కుదిరింది. ఏపీ రవాణాశాఖ మంత్రికి అభినందనలు తెలియజేస్తున్నా. ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ లేదనే విషయం కరోనా రావడం వల్లే తెలిసింది. ఇరు రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందం వల్ల ఏపీఎస్ ఆర్టీసీకి లాభమే. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే.. ఏపీ , తెలంగాణల మధ్య రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. అందుకే అగ్రిమెంట్ చేసుకున్నాం. ఈ రోజు రాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు.. రెండు రాష్ట్రాల మధ్య నడుస్తాయి. టీఎస్ ఆర్టీసీకి ఛార్జీలు పెంచే ఆలోచన లేదు. ఆర్టీసీల మధ్య చర్చలు ఆలస్యం అవ్వడం వల్ల... ప్రైవేట్ ట్రావెల్స్‌కు లాభం చేకూరుస్తుందనే మాట వాస్తవం కాదు. తెలంగాణ ఆర్టీసీకి రెవెన్యూ నష్టం రూ.2వేల కోట్లు కాగా, ఏపీ ఆర్టీసీకి రూ.2400 కోట్ల నష్టం వచ్చింది"
-పువ్వాడ అజయ్ కుమార్, తెలంగాణ మంత్రి
7 నెలల సుదీర్ఘ విరామం
కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ విధించటంతో మార్చి 23 నుంచి ఏపీ, తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ నిబంధనలను సడలించినప్పటికీ ఇవి పునఃప్రారంభానికి నోచుకోలేదు. రాష్ట్ర విభజన తర్వాత ఆర్టీసీ బస్సుల రాకపోకల కోసం రెండు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర సర్వీసుల ఒప్పందం జరగలేదు. సమన్యాయం ప్రాతిపదికన రెండు రాష్ట్రాలూ కిలోమీటర్లు, సర్వీసులు సమానంగా నడిపేందుకు ఒప్పందం చేసుకున్న తర్వాతే ఆంధ్రప్రదేశ్‌కు బస్సులు నడపాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు స్పష్టం చేయటంతో బస్సులకు బ్రేకులు పడిన విషయం విదితమే. ఇప్పుడు ఇరు రాష్ట్రాల ఆర్టీసీ ఎండీలు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయడంతో సేవలను పునరుద్ధరించారు.
ఇదీ చూడండి: తెలుగు రాష్ట్రాల్లో బస్సులు తిప్పేందుకు ఇరు రాష్ట్రాల చర్యలు