భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. జిల్లాలవారీగా సమాచారం తెలుసుకొని తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు, సూచనలు చేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. వర్షాల వల్ల కొన్ని చోట్ల ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. మరో మూడు, నాలుగు రోజులపాటు కూడా భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, జలవనరులశాఖ, విద్యుత్, పురపాలక, పంచాయతీరాజ్, వ్యవసాయ, ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ శాఖ అధికారులతో సీఎం సమావేశమయ్యారు.