చిన్న పాలనా విభాగాల వల్ల పరిపాలన ప్రజలకు చేరువ చేసి, మెరుగైన సేవలు అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం భారీగా పరిపాలనా సంస్కరణలు చేపట్టింది. కొత్తగా 23 జిల్లాలు ఏర్పాటు చేసి 33 జిల్లాల తెలంగాణగా మార్చింది. రెవెన్యూ డివిజన్ల సంఖ్య 45 నుంచి 73కు, మండలాల సంఖ్య 459 నుంచి 580కి పెంచింది.
పోలీసు విభాగం
పరిపాలనా విభాగాలతోపాటు పోలీసు వ్యవస్థను కూడా పునర్వ్యవస్థీకరించింది. అంతకుముందు రాష్ట్రంలో హైదరాబాద్, సైబరాబాద్ పోలిస్ కమిషనరేట్లు మాత్రమే ఉండగా... కొత్తగా వరంగల్, కరీంనగర్, రాచకొండ, సిద్దిపేట, ఖమ్మం, నిజామాబాద్, రామగుండం పోలిస్ కమిషనరేట్లను ఏర్పాటు చేసింది. వీటితో పాటు కొత్తగా 25 పోలిస్ సబ్ డివిజన్లు, 31 సర్కిళ్లు, 103 పోలిస్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఇదీ చూడండి:ఆరేళ్ల పోలీసు రంగంలో.. అనేక మార్పులు
పట్టణ పాలన
రాష్ట్రంలో వేగంగా జరుగుతున్న పట్టణీకరణను దృష్టిలో ఉంచుకొని పురపాలికలు, నగరపాలికల సంఖ్యను భారీగా పెంచింది. చాలా గ్రామాలను సమీపంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనం చేసింది. 2014 వరకు 52 మున్సిపాలిటీలు ఉండగా... కొత్తగా మరో 76 ఏర్పాటు చేసి 128కి పెంచింది. ఆరు కార్పొరేషన్ల ఉండగా... మరో 7 నగరపాలికలను ఏర్పాటు చేసింది. దీంతో రాష్ట్రంలో పట్టణ ప్రాంత స్థానిక సంస్థల సంఖ్య 141కి చేరింది.
పంచాయతీ వ్యవస్థ
గ్రామపంచాయతీల సంఖ్యను కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచింది. తండాలను పంచాయతీలుగా మార్చాలన్న డిమాండ్‌ను నెరవేర్చడమే కాకుండా... మారుమూల గ్రామాలకు కూడా పంచాయతీ హోదా కల్పించింది. దీంతో రాష్ట్రంలో అప్పటి వరకు 8,690 గ్రామపంచాయతీలు ఉండగా... కొత్తగా ఏర్పాటైన 4,383తో కలిపి 12,751కి చేరింది.
ఇదీ చూడండి: ప్రత్యేక రాష్ట్రంలో పెరిగిన రహదారులు..
నేరుగా నిధులు
పట్టణ, గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థలకు బడ్జెట్లోనే నిధుల కేటాయించింది. జనాభా ప్రాతిపదికన మున్సిపాలిటీలు, పంచాయతీలకు ప్రతినెలా విధిగా డబ్బులు వెళ్లేలా ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున పాలనా విభాగాలను పునర్వ్యవస్థీకరించిన రాష్ట్ర ప్రభుత్వం... 28 జిల్లా కేంద్రాల్లో సమీకృత కలెక్టరేట్లు, జిల్లా పోలీసు కార్యాలయాలను నిర్మిస్తోంది.
ఇదీ చూడండి: రైతే రాజుగా.. తెలంగాణ అడుగులు