VSP Woman missing: ఏపీలోని విశాఖ బీచ్‌లో గల్లంతైందని భావించిన యువతి కేసులో అనేక ట్విస్ట్లు కొనసాగుతున్నాయి. ఆమె కోసం నౌకాదళ హెలికాప్టర్లు అవిశ్రాంతంగా గాలిస్తే.. ఆమె ఆచూకీ అనూహ్యంగా నెల్లూరులో వెలుగు చూసింది. తాజాగా బెంగళూరు నుంచి తల్లిదండ్రులకు వాట్సప్ మెసెజ్ చేసిన సాయిప్రియ.. తాను క్షేమంగా ఉన్నానని.. వెతకొద్దంటూ సూచించింది. రవితో తాను ఇష్టపూర్వకంగానే వెళ్లానని.. తాళిబొట్టుతో ఉన్న ఫొటోను తల్లిదండ్రులకు పంపింది.
విశాఖ బీచ్‌లో వివాహిత గల్లంతైందన్న అనుమానం.. ఆమె కోసం పోలీసులు, కోస్ట్ గార్డు సిబ్బంది గాలింపు వృథా ప్రయాసగా మారింది. సాయిప్రియ ఆర్కే బీచ్‌లో గల్లంతైందని భర్త, కుటుంబ సభ్యులు చెప్పడంతో బుధవారమంతా కోస్ట్ గార్డు హెలికాప్టర్, రెండు పెద్ద బోట్లు తీరాన్ని జల్లెడ పట్టాయి. బీచ్‌లో సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులకు మహిళ గల్లంతైన ఆనవాళ్లు ఎక్కడా కానరాకపోవడంతో మరో కోణంలో విచారణ సాగించారు. ఆమె కాల్ డేటాను పరిశీలించడంతో ఆమె నెల్లూరులో ఉందన్న వ్యవహారం బయటకు వచ్చింది.
విశాఖకు చెందిన సాయిప్రియకు, శ్రీనివాసరావుతో రెండేళ్ల క్రితం పెళ్లయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్న శ్రీనివాసరావు.. రెండో పెళ్లి రోజు జరుపుకునేందుకు పుట్టింట్లో ఉన్న సాయిప్రియ వద్దకు వచ్చాడు. సోమవారం సాయంత్రం భార్యాభర్తలు సరదాగా ఆర్కే బీచ్‌లో గడిపారు. ఇంటికి వెళ్దామనుకున్న సమయంలో సముద్రంలో కాళ్లు కడుక్కుని వస్తానని చెప్పిన సాయిప్రియ మళ్లీ భర్తకు కానరాలేదు. ఆమె సముద్రంలో గల్లంతై ఉంటుందని భావించిన శ్రీనివాసరావు అత్తమామలకు సమాచారమిచ్చాడు.
విశాఖ డిప్యూటీ మేయర్ జియ్యాన శ్రీధర్ వార్డులోనే సాయిప్రియ తల్లిదండ్రులు ఉండటం వల్ల ఆయన ద్వారా పోలీసులకు తెలియజేశారు. కోస్ట్ గార్డు సహాయంతో గాలింపు చర్యలు కొనసాగించారు. ఒక హెలికాప్టర్, రెండు భారీ టగ్‌ల సహాయంతో తీరం వెంట.. సముద్ర జలాల్లోనూ గాలింపు చేపట్టారు. మూడో పట్టణ పోలీసులు సాగర తీరం వెంబడి ఉన్న నిఘా కెమెరాల రికార్డులను నిశితంగా పరిశీలించారు. ఎక్కడా మహిళ మునిగిపోతున్న దృశ్యాలు నమోదు కాలేదు. చివరకు సాయిప్రియ కాల్ డేటా ఆధారంగా విచారణ సాగించడంతో.. ఆమె నెల్లూరులో బంధువులింట ఉందని తెలిసింది. ఆ తర్వాత ఆమె బెంగళూరు నుంచి తల్లిదండ్రులకు వాట్సప్ మెసెజ్ చేసింది. తాను క్షేమంగా ఉన్నానని.. రవితో ఇష్టపూర్వకంగా వెళ్లినట్లు తెలిపింది. తన ఫొటోను పంపిన ఆమె.. తాళిబొట్టుతో కనిపించింది.
సాయిప్రియను వెతికేందుకు పోలీసులు, గజ ఈతగాళ్లు, కోస్ట్ గార్డు బోట్లు, హెలికాప్టర్లతో ఎంతో శ్రమించారు. ఒక టగ్ ఒక గంట సేపు గాలించాలంటే వందల లీటర్ల డీజిల్ వాడాలి. హెలికాప్టర్ గాలిలో గంట సేపు సముద్ర తీరం వెంబడి గాలించాలంటే భారీగానే ఖర్చు పెట్టాలి. సాయిప్రియ కోసం దాదాపు 10 గంటల పాటు రెండు టగ్ బోట్లు, ఒక హెలికాప్టర్ గాలింపులో పాల్గొన్నాయి.
ఇవీ చూడండి..
ED Raids in Hyderabad : 'జూద' పర్యటనలపై ఈడీ కన్ను.. ప్రముఖుల్లో వణుకు
రికార్డు స్థాయికి ద్రవ్యోల్బణం.. మరోసారి 'ఫెడ్' వడ్డీ రేట్లు పెంపు