ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడితే తొలుత అరెస్టు చేసి అనంతరం ఆ సమాచారాన్ని సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు పంపేవారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులలోనూ ఇదే రీతిలో వ్యవహరించేవారు. కానీ ఇప్పుడు అవినీతి కేసుల్లో చిక్కుకున్న వారి విషయంలో తీర్పు త్వరగా వచ్చేలా... అనిశా కొత్త ప్రయోగాన్ని ప్రారంభించింది. నిందితులను అరెస్టు చేసిన అనంతరం దర్యాప్తును త్వరగా ముగించి అభియోగపత్రాలను దాఖలు చేయడంలో నిమగ్నమైంది. అరెస్టు సమయంలో సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో పాటు అక్కడి నుంచి అనుమతి కోసం వేచి చూడకుండానే ముందుకు వెళ్తోంది. గత నెలలో నాలుగు కేసుల్లో అభియోగపత్రాలను దాఖలు చేసింది. ఆయా శాఖల నుంచి అనుమతి వచ్చిన తర్వాత ఆ పత్రాలను న్యాయస్థానంలో అందజేయాలని నిర్ణయించింది. ఈ రకంగా వ్యవహరించడం వలన కాలయాపన జరగకుండా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
ట్రయల్స్ పూర్తయ్యేలోపు అనుమతి పత్రం
అక్రమాస్తుల కేసులో గతంలో అరెస్టయిన సైబరాబాద్ పోలీసు అధికారి పై అనిశా... గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో ప్రస్తుతం విచారణ జరుగుతోంది. విచారణ క్రమంలో అభియోగపత్రం అంశం ప్రస్తావనకు వచ్చింది. అవినీతికి పాల్పడి చిక్కిన అధికారిపై సంబంధిత శాఖ అనుమతి రాలేదన్న కారణంతో అభియోగపత్రం దాఖలు చేయకుండా ఉండాల్సిన అవసరం లేదని కొద్దిరోజుల క్రితమే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ట్రయల్స్ పూర్తయ్యేలోపు ఎప్పుడైన సరే అనుమతి పత్రం సమర్పించవచ్చని పేర్కొంది.
దీని ఆధారంగా మరిన్ని కేసుల్లో ఇదే తరహాలో అభియోగపత్రాలు దాఖలు చేసేందుకు ఏసీబీ సిద్ధమైంది.
ఇవీ చూడండి: ఆర్థిక క్రమశిక్షణ పాటించండి: సీఎం కేసీఆర్