ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి సహా మిగతా నిందితులు మంగళవారం విచారణకు హాజరు కాకపోతే వారంట్ జారీ చేస్తామని అ.ని.శా. కోర్టు హెచ్చరించింది. ఇవాళ విచారణకు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్, ఉదయ్ సింహ హాజరయ్యారు. రేవంత్ రెడ్డి అందుబాటులో లేనందున నేటి విచారణకు మినహాయింపు ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది కోరారు.
అంగీకరించిన న్యాయస్థానం.. నిందితులందరూ కచ్చితంగా మంగళవారం హాజరు కావాలని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల ప్రకారం ఓటుకు నోటు కేసుపై విచారణ వీలైనంత వేగంగా చేపట్టాలని న్యాయస్థానం పేర్కొంది. అభియోగాల నమోదుపై విచారణ రేపటికి వాయిదా వేసింది.
నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల కోర్టులో పలు కేసుల విచారణ జరిగింది. అనుమతి లేకుండా జాతీయ జెండా యాత్ర నిర్వహించారని భాజపా శాసనసభ్యుడు రాజాసింగ్‌పై అఫ్జల్‌గంజ్ ఠాణాలో నమోదైన కేసును కోర్టు కొట్టివేసింది. వేర్వేరు కేసుల్లో ఎమ్మెల్యేలు రాజయ్య, వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియ, రాజాసింగ్ ఇవాళ హాజరయ్యారు.
ఇదీ చూడండి: పీవీ ఫొటో ప్రదర్శన.. 'మెనీ ఫేసెస్ ఆఫ్ ఏ మాస్టర్'