ఇంజినీరింగ్, ఫార్మసీ, మేనేజ్‌మెంట్ కోర్సులకు సంబంధించి అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి మరోసారి విద్యా కాలపట్టికను సవరించింది. ఈసారి తరగతుల ప్రారంభానికి తుది గడువును మరింత పెంచింది. మే నెల మొదటి వారంలో ఏఐసీటీఈ తొలి విద్యా కాలపట్టికను విడుదల చేసింది. ఆ ప్రకారం సెప్టెంబరు 1వ తేదీలోపు ఇప్పటికే చదువుతున్న వారికి, 15లోపు కొత్తగా ఫస్టియర్ వారికి ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ లేదా రెండింటి ద్వారా తరగతులను ప్రారంభించాలని నిర్దేశించింది. తాజాగా సవరించిన కాలపట్టిక ప్రకారం పాత విద్యార్థులకు అక్టోబరు 1వ తేదీ, కొత్తవారికి అక్టోబరు 25లోపు తరగతులను ప్రారంభించుకోవచ్చు. ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రవేశానికి కౌన్సెలింగ్ సెప్టెంబరు వరకు పూర్తవుతుంది. అంతకంటే ముందు రాష్ట్రాల్లో కౌన్సెలింగ్ పూర్తి చేస్తే విద్యార్థులకు సమస్య అవుతుందని, రాష్ట్ర కళాశాలల్లో చేరి మళ్లీ ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో సీట్లు వచ్చాయంటూ వెళతారని, దానివల్ల గందరగోళం తలెత్తుతుందని, రాష్ట్ర కళాశాలల్లో సీట్లు భర్తీ కాకుండా మిగిలిపోతాయన్న ఆందోళన ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల్లో నెలకొంది. దీనిపై ఫిర్యాదులు అందటంతో తరగతుల ప్రారంభానికి గడువును ఏఐసీటీఈ పెంచినట్లు భావిస్తున్నారు.
రాష్ట్రంలో ముందుగానే...
రాష్ట్రంలో ఆగస్టు 4, 6, 7 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు జరుగుతాయి. అగ్రికల్చర్ విభాగంతో కలిపి 9వ తేదీతో పూర్తవుతాయి. ఈసారి ఇంటర్ మార్కులకు వెయిటేజీ లేనందున వారం, పది రోజుల్లో ర్యాంకులు వెల్లడవుతాయి. తర్వాత వెంటనే కౌన్సెలింగ్ ప్రారంభిస్తే ఏఐసీటీఈ తొలిసారిగా ఇచ్చిన విద్యా కాలపట్టిక ప్రకారం సెప్టెంబరు 15లోపు తరగతులు ప్రారంభించే అవకాశం ఉందని ఉన్నత విద్యామండలి వర్గాలు చెబుతున్నాయి.
ఇదీ కొత్త కాలపట్టిక
జులై 15: ఏఐసీటీఈ అనుమతులకు తుది గడువు
ఆగస్టు 10: వర్సిటీల అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు
సెప్టెంబరు 30: మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తి
అక్టోబరు 01: పాత విద్యార్థులకు తరగతులు
అక్టోబరు 10: రెండో విడత కౌన్సెలింగ్
అక్టోబరు 20: ఖాళీల భర్తీకి చివరి గడువు
అక్టోబరు 25: కొత్త విద్యార్థులకు తరగతులు