పెద్ద చదువులు చదువుకుని, కార్పొరేట్ సంస్థలో ఆరంకెల జీతం తీసుకున్న ఆమె.. తన మార్గాన్ని మార్చుకుంది. మహిళా సాధికారత కోసం తన వంతుగా ఏదైనా చేయాలనుకుని... బ్లాగర్, రచయిత్రి, సామాజిక సేవా కార్యకర్త, వాణిజ్యవేత్త, కొరియోగ్రఫర్ ... ఇలా పలు మార్గాలను ఎంచుకుంది. మహిళలకు పలు రంగాల్లో శిక్షణనందిస్తోంది. ఈ సేవలకు పలు అవార్డులనూ దక్కించుకున్న 38 ఏళ్ల అనుపమ దాల్మియా సాధించిన విజయాలను ఓ సారి పరిశీలిద్దాం.
చిన్నారుల కోసం 'బియాండ్ ద బాక్స్'
పుణె విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ ఇంజినీరింగ్ చదివిన అనుపమ, అహ్మదాబాద్‌లో సిస్టమ్స్ అండ్ ఫైనాన్స్‌లో ఎంబీఏ చేసింది. 2006లో ఇన్ఫోసిస్‌లో కన్సల్టెంట్‌గా చేరింది. అక్కడ ఆరేళ్లు పనిచేసింది. చిన్నప్పటి నుంచి తన కాళ్లపై తాను నిలబడాలని, చిన్నారులకు, మహిళలకు ఉపయోగపడేలా ఏదైనా చేయాలని ఆలోచించే అనుపమకు ఈ ఉద్యోగంలో క్షణం తీరిక లేకపోవడం నిరుత్సాహానికి గురి చేసింది. దాంతో ఉద్యోగానికి రాజీనామా చేసింది. ‘క్రియేటివ్ రైటింగ్ అండ్ కమ్యూనికేషన్’ అంశంపై మూడు రోజుల పాటు పిల్లలకు సమ్మర్ వర్క్‌షాపు నిర్వహించింది. అక్కడ చిన్నారుల భావవ్యక్తీకరణ, వారి ఆలోచనలు అనుపమను ఆలోచింపచేశాయి. పాఠశాల స్థాయి నుంచి పిల్లలను ఈ దిశగా ప్రోత్సహిస్తేనే వారి సృజనాత్మకత బయటకు వస్తుందని భావించింది. దీనికోసం 2019లో ‘బియాండ్ ద బాక్సు’ స్టార్టప్‌ను స్థాపించిందామె. ఈ వెబ్‌సైట్‌లో వందల మంది చిన్నారులు నైపుణ్యాలను ప్రదర్శించగలుగుతున్నారు.
మరుగున పడిన వంటకాల కోసం...
అనుపమ చిన్నప్పటి నుంచి అమ్మ వంటకాల రుచిని ఆస్వాదించడమే కాదు, ఎప్పటికైనా ఓ రెస్టారెంట్ ప్రారంభించాలని చెప్పే మాటలనూ వింటూ పెరిగింది. అలా అమ్మ కోసం ప్రారంభించిందే.. ‘టింగిల్ యువర్ టేస్ట్ బడ్స్’ వెబ్‌సైట్. దేశవ్యాప్తంగా మరుగున పడుతున్న వంటకాలను పరిచయం చేసే వేదికగా దీన్ని మార్చింది. ఎవరైనా సరే తెలిసిన వంటలను ఈ సైట్‌లో పొందుపరచొచ్చు. భారతీయ వంటకాలెన్నింటినో ఈ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. దీనిద్వారా సంప్రదాయ వంటలను అందరికీ పరిచయం చేస్తున్న అనుపమ కృషికిగాను 2017, 2018 సంవత్సరాల్లో ‘బెస్ట్ బ్లాగర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు’ దక్కింది. ఇవి కాక ‘రిథమ్స్ అండ్ బీట్స్’ స్టార్టప్ ద్వారా ఆన్‌లైన్‌లో డాన్స్ వర్క్‌షాపులు నిర్వహిస్తోంది. పబ్లిక్ ఈవెంట్స్‌కు కొరియోగ్రఫీ కూడా చేస్తున్న ఈమె ‘ద బెస్ట్ సోషల్ ఇన్‌ఫ్లూయెన్సర్’ గౌరవాన్ని అందుకుంది. ‘అమ్మ నాకు చదువు, నృత్యం, చిత్రకళ, పుస్తకపఠనం వంటి అంశాల్లో ప్రవేశం కల్పించింది. సమాజానికి ఎంతోకొంత సేవ చేయాలనీ నేర్పించింది. ఇవన్నీ నాకు ప్రేరణ. పిల్లలకు సృజనాత్మకత స్వేచ్ఛగా బయటకు రావడానికి పెద్దలు కృషి చేయాలి. అప్పుడే వారు చదువుతోపాటు సామాజిక అంశాల్లోనూ చురుగ్గా ఉంటారు. అందుకే పిల్లల కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నాను. అలాగే ఆరోగ్య విలువలు నిండి ఉండే మన సంప్రదాయ వంటకాలు అంతరించిపోకుండా భావితరాలకు పంచడం కోసం సైట్ పెట్టా’ అని వివరించింది అనుపమ.
ఇదీ చదవండి: KTR: హుజూరాబాద్‌పై వ్యూహరచన.. ప్రధాన కార్యదర్శులతో కేటీఆర్ సమావేశం