మహారాష్ట్ర ముంబయిలోని సకినాకలో అత్యంత ఆటవికంగా అత్యాచారానికి గురైన మహిళ.. చివరికి ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచింది. సుమారు 33 గంటలపాటు తీవ్రమైన క్షోభను అనుభవించి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఆమెను బతికించడానికి వైద్యులు చేసిన కృషి బూడిదలో పోసిన పన్నీరుగా మారింది. 34 ఏళ్ల గల ఈ మహిళపై తన వాహనంలోనే అత్యాచారానికి పాల్పడ్డాడు మోహన్ చౌహాన్ అనే కిరాతకుడు. అంతటితో ఆగక.. మహిళ ప్రైవేట్ భాగాల్లో ఇనుప రాడ్‌ను దూర్చి చిత్రహింసలకు గురిచేశాడు.
ఏం జరిగిందంటే..?
శుక్రవారం ఉదయం ఖైరానీ రోడ్డు సమీపంలో ఓ మహిళ రక్తపు మడుగులో పడిఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. బాధితురాలిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మహిళపై గురువారం.. అత్యాచారం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీస్ అధికారి తెలిపారు.
పోలీసుల కస్టడిలో నిందితులు...
నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టు ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం ఈ నెల 21 వరకు పోలీస్ కస్టడీనిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.
మరోవైపు అత్యాచార ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే. బాధితురాలికి వేగంగా న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దర్యాప్తును వేగవంతం చేయాలని స్పష్టం చేసినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
ఇదీ చూడండి: murder: అర్ధరాత్రి ఫోన్ చేశారు.. అతికిరాకంగా తల, చేతులు నరికేసి చంపేశారు!