ఉన్నత చదువుల కోసం భర్త ఆరేళ్ల క్రితం ఆస్ట్రేలియాకు వెళ్లాడు.. అప్పుడప్పుడూ ఇంటికి వచ్చిపోవడం తప్ప కుటుంబ విషయాలను పట్టించుకోవడం లేదు... ఇద్దరు పిల్లలతో ఉంటున్న భార్యకు రెండేళ్ల క్రితం తన గ్రామానికే చెందిన స్నేహితుడు కలిశాడు. కొద్దిరోజులకే అత్యంత సన్నిహితులుగా మారి వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారు.
ఏడాది క్రితమే భర్తకు తెలుసు...
వీరి వ్యవహారం ఏడాది క్రితం భర్తకు తెలిసింది.. గట్టిగా హెచ్చరిస్తే అలాంటిదేమి లేదంటూ ఆమె బుకాయించింది. సాక్ష్యాధారాలతో పట్టుకోవాలనుకున్న భర్త ఆమెకు తెలియకుండా ఇరవై రోజుల క్రితం హైదరాబాద్ వచ్చి నిఘా ఉంచాడు. తప్పించుకోకుండా దొరకాలని సమయం కోసం ఎదురుచూస్తున్నాడు.
ఇద్దరూ ఇంట్లో ఉండగా...
భార్య, ఆమె స్నేహితుడు శుక్రవారం రాత్రి ఇంట్లో ఉండగా అర్ధరాత్రి వెళ్లిన భర్త తలుపు కొట్టాడు. ఇద్దరూ పట్టుబడ్డారు. వెంటనే పోలీసులకు విషయాన్ని వివరించాడు. పోలీసులు వచ్చి మాట్లాడుతుండగా...
మరో గదిలో ఇంకో జంట కనిపించింది. వీరు కూడా దంపతులు కాదని తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి భార్య మినహా మిగిలిన ముగ్గురిని శనివారం అరెస్ట్ చేశారు. చైతన్యపురి ఠాణా పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది... ఇన్‌స్పెక్టర్ జానకిరెడ్డి వివరాలను వెల్లడించారు.
నగరంలో నివాసం.. ఆస్ట్రేలియా పయనం..
సూర్యాపేట జిల్లా నడిగూడెంకు చెందిన వ్యక్తికి అదే జిల్లాకు చెందిన యువతితో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. కొద్దిరోజులకే కొత్తపేట వాసవీకాలనీలోని సొంత ఫ్లాట్‌కు కాపురం మార్చారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన భర్త.. ఎంఎస్ చదివేందుకు ఆరేళ్ల క్రితం ఆస్ట్రేలియాకు వెళ్లాడు.
చిన్ననాటి స్నేహితుడితో...
చదువు కొనసాగిస్తూనే సెలవులున్నప్పుడు ఇంటికి వచ్చి వెళ్లేవాడు. తన భార్య ఓ వైద్యుడితో సన్నిహితంగా ఉంటోందని తెలుసుకున్న భర్త అతని వివరాలను సేకరించగా... ఆమె చిన్ననాటి స్నేహితుడు డాక్టర్ శివప్రసాద్ అని తెలుసుకున్నాడు.
వద్దని వారించినా.. వినలేదు!
భార్యకు ఫోన్ చేసి గట్టిగా హెచ్చరించాడు. అయినా మార్పు రాలేదు. దీంతో శుక్రవారం అర్ధరాత్రి వాసవీకాలనీలోని తన ఫ్లాట్‌కు చేరుకుని ఇద్దరినీ పట్టుకున్నాడు. తమ ఇంట్లో ఎందుకు ఉన్నావంటూ శివప్రసాద్‌ను ప్రశ్నించాడు. తాను ఎప్పుడైనా వస్తానని, ఇంకా ఏమైనా మాట్లాడితే చంపేస్తానంటూ శివప్రసాద్ బెదిరించాడు.
భర్త అప్పటికే డయల్ 100కు ఫోన్ చేయడం, ఈ గొడవ జరుగుతున్నప్పుడే చైతన్యపురి పోలీసులు అక్కడికి వచ్చి మాట్లాడుతుండగానే ఇంకో గదిలో నరేష్, మరో యువతి దొరికిపోయారు. వీరు కూడా ఆమె స్నేహితులని తెలిసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులపై ఐపీసీ 448, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని ఇన్‌స్పెక్టర్ జానకిరెడ్డి తెలిపారు.