ఏపీ విశాఖ జిల్లాలో జరిగిన పాపికొండల బోటు ప్రమాదంలో ఇద్దరు బిడ్డలను కోల్పోయిన రోజే.. మళ్లీ ఆ దంపతులకు కవలలు పుట్టారు. 2019 సెప్టెంబర్ 15న పాపికొండల ప్రయాణంలో రాయల్ వశిష్ఠ పడవ గోదావరి నదిలో మునిగిపోయిన ఘటన అనేక మంది జీవితాల్లో విషాదాన్ని నింపింది. ఆ ప్రమాదంలో విశాఖ నగరానికి చెందిన తల్లారి అప్పలరాజు, భాగ్యలక్ష్మి దంపతుల పిల్లలు గీతావైష్ణవి (3), ధాత్రి అనన్య (ఏడాదిన్నర) మృత్యువాతపడ్డారు.
భాగ్యలక్ష్మి రెండో కుమార్తె పుట్టిన తరువాత.. పిల్లలు పుట్టకుండా అప్పట్లో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకున్నారు. ప్రమాదంలో కన్నబిడ్డలను కోల్పోయిన ఆ దంపతులు.. ఆధునిక సాంకేతికత ద్వారా మళ్లీ సంతానం కోసం విశాఖ నగరంలోని ఓ వైద్యురాలిని సంప్రదించారు. ఆమె సలహా మేరకు ఐవీఎఫ్ చికిత్స విధానంలో భాగ్యలక్ష్మి మళ్లీ గర్భందాల్చారు. ఈనెల 15న భాగ్యలక్ష్మి కవల ఆడపిల్లలకు జన్మనిచ్చారు.
భాగ్యలక్ష్మికి అందించిన చికిత్సపై మాట్లాడిన వైద్యురాలు సుధా పద్మశ్రీ.. అక్టోబర్ 20న ప్రసవం అవుతుందని తాము అంచనా వేశామని.. కానీ ఈ నెల 15న పురిటి నొప్పులు రావడంతో శస్త్రచికిత్స ద్వారా పిల్లల్ని కాపాడినట్లు తెలిపారు. పడవ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులను కోల్పోయిన దంపతులకు.. అదే రోజున కవలలు జన్మించడంపై సంతోషం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: RTC CHAIRMAN BAJIREDDY: 'ఆర్టీసీ ఆదాయాన్ని పెంచి పూర్వ వైభవం తెస్తాం..'