నవమాసాలు మోసి కనిపెంచిన తల్లిని... కారడవిలో వదిలేశాడు ఓ కసాయి కుమారుడు . లాలించి, గోరు ముద్దలు తినిపించిన తనయుడికి.... ఆ తల్లి పోషణ, భారంగా మారింది. దయాదాక్షిణ్యాలు కూడా మరిచి ఆమెను వదిలించుకోవాలని జన సంచారం లేని ప్రాంతంలో వదిలేశాడు. ఇది అర్థం కాని ఆ తల్లి పుత్రడు రాక పోతాడా అని నిరీక్షించింది. కానీ ఆమె కోరిక తీరలేదు. ఆ తనయుడు రాలేదు. అది తెలుకున్న ఆ అమ్మ మనసు భోరున విలపించింది. కాసేపటికి నిస్సతువతో స్పృహ తప్పి పడిపోయింది.
ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలానికి చెందిన లింగమ్మ కుమారుడు... తల్లిని వదిలించుకోవాలనే ఉద్దేశంతో... భార్యతో కలిసి ఆమెను ఆటోలో తీసుకువచ్చి... కడప శివారులోని జన సంచారం లేని ప్రాంతంలో వదిలేశాడు. తిరిగి వస్తామని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయారు.
దీంతో ఆ తల్లి తన తనయుడు వస్తాడని, తీసుకెళతాడని ఆశగా ఎదురుచూస్తోంది. ఎంతసేపటికీ రాకపోవడంతో ఆమె అక్కడే స్పృహ తప్పి పడిపోయింది. అటు వైపు విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఆమెను చూసి వెంటనే సపర్యలు చేసి ఇక్కడున్నావెందుకని ప్రశ్నించారు. తనను కుమారుడు, కోడలు ఇక్కడ వదిలిపెట్టి, మళ్లీ వస్తామని వెళ్లిపోయారని చెప్పింది.
ఆమె దయనీయ పరిస్థితి చూసి చలించిపోయిన కానిస్టేబుల్ వారు రారని నిర్ధరించుకుని ‘108’కి సమాచారం అందించారు. వెంటనే సిబ్బంది వచ్చి ఆమెకు పూర్తిస్థాయిలో సపర్యలు చేసి కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండీ: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య