Human Rights Commission: మంత్రి జగదీశ్‌రెడ్డి నుంచి రక్షణ కల్పించాలని, ప్రాణహాని ఉందని ఓ బాధిత కుటుంబం హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు చేసింది. సూర్యాపేట జిల్లా ఎర్కారం గ్రామానికి చెందిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన తన భర్త ఎల్లయ్యపై... రాజకీయ కక్ష్యతో ఓ మర్డర్ కేసు నమోదు చేసి పీడీ యాక్ట్ కింద అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేశారని అతని భార్య యాదమ్మ, కూతురు ఆవేదన వ్యక్తం చేశారు.
జైలు నుంచి విడుదలైన అనంతరం మంత్రి జగదీశ్ రెడ్డి అండతో వారి అనుచరులు మరోసారి హత్యాయత్నం చేశారని తెలిపారు. ఈ సంఘటన గురించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదన్నారు. సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్, డీఎస్పీ మోహన్ కుమార్, సీఐ ఆంజనేయులు మంత్రి ఆదేశాల మేరకు హత్యాయత్నం జరిగినా పట్టిచుకోకుండా... తన భర్త పై అక్రమ కేసులు నమోదు చేసి జైలు పాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
తన భర్త తెరాస పార్టీలో చేరనందుకే... రాజకీయ కక్షతో మంత్రి తమ కుటుంబాన్ని అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని బాధితులు హెచ్ఆర్సీకి వివరించారు. తమ కుటుంబానికి, తన భర్తకు మంత్రి జగదీశ్ రెడ్డి, ఆయన అనుచరుడు వట్టే జానయ్య, జిల్లా ఎస్పీ, డీఎస్పీల నుంచి రక్షణ కల్పించాలని బాధిత కుటుంబం హెచ్ఆర్సీని వేడుకుంది. కేసును స్వీకరించిన మానవ హక్కుల సంఘం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.
ఇదీ చదవండి:'రాజ్‌భవన్ వర్సెస్ ప్రగతిభవన్... వివాదం హస్తినకు'