ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కేసుల సంఖ్య లక్షన్నర దాటింది. గడిచిన 24 గంటల్లో 60,797 నమూనాలను పరీక్షించగా కొత్తగా 9,276 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం కేసుల సంఖ్య 1,50,209కి చేరింది. వైరస్‌తో ఇవాళ మరో 58 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు కరోనా బారిన పడి 1,407 మంది మృతి చెందారు.
ఏపీలోని వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో 72,188 మంది చికిత్స పొందుతుండగా.. 76,614 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇవాళ అత్యధికంగా 12,750 మంది కొవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 20,12,573 నమూనాలను ప్రభుత్వం పరీక్షించింది. తూర్పుగోదావరిలో 8 మంది, విశాఖపట్నంలో 8, గుంటూరులో ఏడుగురు, అనంతపురంలో ఆరుగురు, చిత్తూరులో ఆరుగురు, కర్నూలులో ఆరుగురు, శ్రీకాకుళంలో నలుగురు, కృష్ణాలో ముగ్గురు, పశ్చిమగోదావరిలో ముగ్గురు, నెల్లూరులో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, విజయనగరంలో ఇద్దరు, కడపలో ఒక్కరు కరోనాతో మృతి చెందారు.