కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలోని చెవిటికల్లు వద్ద కృష్ణా నదిలో ఒక్కసారిగా వరద ఉద్ధృతి పెరిగింది. నదిలో ఇసుక కోసం వెళ్లిన వందకుపైగా లారీలు వరదలో చిక్కుకున్నాయి. అకస్మాత్తు వరదతో రహదారి కూడా కొంతమేర దెబ్బతింది. లారీలన్నీ తిరిగి వెనక్కి రాలేని పరిస్థితిలో అక్కడే నిలిచిపోయాయి. దాదాపు 132 లారీలు వరదలో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. సమాచారమందుకున్న పోలీసులు, రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లారీ డ్రైవర్లు, క్లీనర్లు, కూలీలను పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు పడవల్లో ఒడ్డుకు చేర్చారు.
వరద తగ్గితే తప్ప ఈ లారీలను బయటకు తీసుకురాలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కృష్ణానదికి పులిచింతల డ్యామ్ నుంచి 75 వేల క్యూసెక్కులు, మున్నేరు, కట్టలేరు, వైరాల నుంచి మరో 5వేల క్యూసెక్కులు కలిసి 80 వేల క్యూసెక్కుల నీరు కృష్ణానదికి వచ్చి చేరుతుంది. పులిచింతల డ్యామ్ నుంచి నీటిని పూర్తిగా నిలిపివేసి ప్రకాశం బ్యారేజి గేట్లు తెరిస్తే మినహా.. ఈ లారీలు బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే ఇసుక కోసం ఈ లారీలు వెళ్లి సుమారు 20 గంటల సమయం దాటుతోంది.
శనివారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో మున్నేరుకు ఒక్కసారిగా వరద రావడం, లారీలు వెనక్కి తిరిగి వచ్చే రోడ్డు మార్గం లేకపోవడంతో లారీలు అన్నీ వరద నీటిలో చిక్కుకున్నాయి. రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక అధికారులు పడవల ద్వారా లారీ డ్రైవర్లు, క్లీనర్లను ఒడ్డుకు చేర్చగలిగారు. ఇసుక కాంట్రాక్ట్ సంస్థ జె.పి.పవర్ వెంచర్స్ లిమిటెడ్ కంపెనీ ప్రతిరోజూ వందలాది లారీలతో ఇసుక రవాణా చేస్తున్నప్పటికీ.. కనీసం సరైన రోడ్డుమార్గం ఏర్పాటు చేయకపోవడం వల్ల అటు లారీ డ్రైవర్లు, ఇటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి నుంచి చెవిటికల్లు మీదుగా కృష్ణానది క్వారీకి వచ్చే రోడ్డు అధ్వానంగా తయారైంది. కనీసం నడిచేందుకు సరైన రోడ్డుమార్గం లేదు. అర్ధరాత్రి నుంచి వరద నీటిలో చిక్కుకున్న లారీ డ్రైవర్లు, క్లీనర్లు, కూలీలు అనేక అవస్థలు పడుతున్నా జె.పి.వపర్ వెంచర్స్ కంపెనీ.. వారి బాగోగుల గురించి పట్టించుకోలేదు. వరదలో చిక్కుకున్న లారీలు వరదకు దెబ్బతింటున్నాయని లారీ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కన్నెత్తి చూడని ఉన్నతాధికారులు..
వరదలో లారీలు చిక్కుకున్న ఈ పరిస్థితి పై జిల్లా ఉన్నతాధికారులెవ్వరూ స్పందించలేదు. కనీసం అటువైపు కన్నెత్తి చూడలేదు. కేవలం మండల స్థాయి అధికారులే పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ పరిస్థితిలో లారీలు రేపటికి కానీ బయటకు వచ్చే మార్గం కనిపించడంలేదు.