Rythu Bandhu Amount credited: రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం పంపిణీ మొదలైంది. తొలిరోజు 586.65 కోట్ల రూపాయలు జమయ్యాయి. మొత్తం 19.98 లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదును వ్యవసాయ శాఖ జమ చేసింది. 11.73 లక్షల ఎకరాల విస్తీర్ణంకు రైతుబంధు సాయం అందించింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో రైతులు సంబురాలు చేసుకుంటున్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని తెలిపిన మంత్రి.. దేశంలో రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు.
జాతీయ పార్టీలైన కాంగ్రెస్, భాజపా పాలిత రాష్ట్రాల్లో ఈ పథకాలు ఎందుకు అమలు చేయట్లేదని.. మంత్రి నిలదీశారు. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ కాగితాలకే పరిమితమని ఎద్దేవా చేశారు. భాజపా పాలిత 18 రాష్ట్రాలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా తెలంగాణ తరహా వ్యవసాయ అనుకూల పథకాలు ఉన్నాయా...? అని ప్రశ్నించారు. జాతీయ పార్టీలకు జాతీయ విధానాలు ఉండవా...? రాష్ట్రానికో విధానం ఉంటుందా...? అని మండిపడ్డారు. అధికార కాంక్ష తప్ప కాంగ్రెస్, భాజపాలకు తెలంగాణపై ప్రేమ లేదని ఆక్షేపించారు. తెలంగాణ ఉద్యమంలోనే కాంగ్రెస్, భాజపా వేసిన పిల్లి మొగ్గలను రాష్ట్ర ప్రజలు చూశారని ఆరోపించారు.
"సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ది కొనసాగుతోంది. సాగు కోసం రైతాంగం ఎవరి దగ్గరా చేయి చాచకూడదన్నదే సీఎం ఆకాంక్ష. తొలిరోజు మొత్తం 19.98 లక్షల మంది రైతుల ఖాతాల్లో 586.65 కోట్ల రూపాయలు జమయ్యాయి. రైతుబంధు పథకం నిధులు రైతుల ఖాతాల్లో జమవుతున్న నేపథ్యంలో.. పెట్టుబడి సాయాన్ని అన్నదాతలు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి." - నిరంజన్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి
ఇవీ చూడండి: