Amaravati farmers padayatra: ఆంధ్రప్రదేశ్లో అమరావతి రైతుల మహాపాదయాత్ర అలుపెరగకుండా సాగిపోతోంది. నేడు 24వ రోజు.. నెల్లూరు జిల్లా సున్నపు బట్టీ నుంచి రాజుపాలెం వరకూ 14 కిలోమీటర్ల మేర నడక సాగనుంది. దారి పొడవునా లభిస్తున్న అపూర్వ ఆదరణతో.. ఉద్యమకారులు ఉత్సాహంగా నడక సాగిస్తున్నారు. 23వ రోజు బోగోలు మండలం కొండ బిట్రగుంట నుంచి దగదర్తి మండలం సున్నంబట్టి వరకు సుమారు 15కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. దారి వెంట స్థానికులు మంచినీరు, మజ్జిగ ఇస్తూ.. రైతులకు సంఘీభావం తెలిపారు. పోలీసులు డప్పు, ఇతర వాద్య కళాకారులను అడ్డుకోగా.. అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు సమయమనం పాటిస్తూ ముందుకు సాగారు. యాత్ర మొత్తం జాతీయ రహదారిపై జరిగినప్పటికీ సమీపంలోని గ్రామాల ప్రజలు.. రోడ్డు వరకు వచ్చి సంఘీభావం తెలిపారు. జై అమరావతి అని నినాదాలు చేసారు. పలు చోట్ల విద్యార్థులూ యాత్రలో పాల్గొన్నారు.
సంఘీభావం
కడనూతల గ్రామంలో మహిళలు రైతులు, పిల్లలు, యువత పూలతో జై అమరావతి, జైజై అమరావతి(Amaravati farmers mahapadayatra) అని రోడ్డుపై రాసి స్వాగతం పలికారు. కోవూరుపల్లి వాసులు ఘన స్వాగతం పలికారు. కప్పరాళ్లతిప్పలో మత్స్యకారులు రైతులకు సంఫీుభావంగా ఉలవపాళ్ల వరకూ.. పాదయాత్రలో పాలుపంచుకున్నారు. ఇస్కపాళెం నుంచి మత్స్యకారులు, మహిళలు వచ్చి సంఘీభావం తెలిపారు. కర్నూలు, నంద్యాల నుంచి వచ్చిన రైతులు అమరావతే అందరికీ అనువైన రాజధానిగా పేర్కొన్నారు.
కడపకు చెందిన ఓ వ్యాపారవేత్త.. కడనూతల వద్ద రైతులను కలిసి 250 చలికోట్లు అందజేశారు. పేరు చెప్పేందుకు ఆయన నిరాకరించారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర దంపతులు.. రూ. 3 లక్షల చెక్కును అమరావతి ఐకాస సభ్యులకు అందజేసారు. ప్రతి గ్రామంలోను ఆర్థిక స్తోమతను బట్టి సాయం చేశారు.
ఇదీ చదవండి.: Paddy Problems: అన్నదాతను వెంటాడుతున్న ధాన్యం అమ్మకం కష్టాలు