హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షాల వల్ల ఇప్పటి వరకు 15మంది మృతి చెందారు. మంగళవారం రాత్రి నుంచి ఇప్పటి వరకు 15మంది మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. పాతబస్తీలో బండ్లగూడ మహమ్మదీయ హిల్స్‌లో రెండు ఇళ్లు కూలి 8 మంది మృతి చెందారు. గగన్ పహాడ్‌లో అప్పాచెరువు వరద ఉద్ధృతికి ముగ్గురు మృతి చెందారు. పల్లె చెరువు కట్ట తెగిపోవడం వల్ల చంద్రాయణ గుట్ట ఆల్ జుబేల్ కాలనీలో ఇద్దరు వరద నీటిలో ప్రాణాలు కోల్పోయారు. ఘాజీమిల్లత్ కాలనీలో గోడ కూలి ఒకరు మృతి చెందారు.
దిల్‌సుఖ్‌నగర్‌లో అపార్ట్మెంట్ సెల్లార్‌లో పడి మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. కొన్ని కాలనీల్లో వరద నీటిలో కొట్టుకుపోయిన ఘటనలూ ఉన్నాయి. ఇవి అధికారుల దృష్టికి వచ్చినప్పటికీ వాళ్లు చనిపోయారా లేకపోతే ప్రాణాలతో బయటపడ్డారా అనేది తేలాల్సి ఉంది. వరద వల్ల చనిపోయిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
ఇవీ చూడండి: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు... జనజీవనం అస్తవ్యస్థం