Sanitation workers Salary: ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య, భద్రతా, రోగుల సహాయక సిబ్బందికి నెలకు రూ.15,600 చొప్పున ఏజెన్సీలు తప్పనిసరిగా చెల్లించాల్సిందేనని వైద్య విద్య సంచాలకులు డాక్టర్ రమేశ్‌రెడ్డి ఆదేశాలు జారీచేశారు. ఇందులోనే పీఎఫ్, ఈఎస్‌ఐ తదితర సామాజిక భద్రతా పథకాలూ వర్తింపజేయాలని స్పష్టం చేశారు. సంబంధిత మార్గదర్శకాలను తాజాగా డీఎంఈ రమేశ్‌రెడ్డి విడుదల చేశారు.
కొన్ని ఏజెన్సీలు సిబ్బంది వేతనాల్లో కోత పెడుతున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని డీఎంఈ తెలిపారు. నిర్దేశిత వేతనాల్లో ఉద్యోగులకు ఎటువంటి కోతలు పెట్టకూడదన్నారు. ఈఎస్‌ఐ, పీఎఫ్ తదితర కోతలు పోనూ సిబ్బందికి నెలకు రూ.12,093 చొప్పున వారి బ్యాంకు ఖాతాలో జమచేయాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రతి 100 పడకల ఆసుపత్రిలో 45 మంది చొప్పున సిబ్బంది సేవలందించాలని, ప్రతి పడకకు ఒక్కంటికి నెలకు రూ.7,500 చొప్పున ఏజెన్సీకి ఉద్యోగుల వేతనాల కోసం ప్రభుత్వం చెల్లిస్తుందని రమేశ్‌రెడ్డి వివరించారు.