'కేజీఎఫ్-2' సినిమాలో.. హీరో ధీరత్వాన్ని కళ్లారా చూసిన కొంత మంది పిల్లల గుంపు.. అతని నుంచి స్ఫూర్తి పొందుతారు. రాకీభాయ్ మేనరిజాన్ని అనుకరిస్తుంటారు. మొదటి పార్ట్‌లో రాకీభాయ్ ఏం చేశాడన్న కథను పార్ట్-2లో.. అచ్చం అలాగే చేసి చూపించి హీరోయిన్‌కు వివరిస్తారు. ఇదంతా సినిమా కథలో భాగంగా జరుగుతుంది. అయితే.. రాకీభాయ్ని చూసి సినిమాలో పిల్లల్లాగే.. బయట కూడా ఓ 15 ఏళ్ల కుర్రాడు విపరీతమైన స్ఫూర్తి పొందాడు. రాకీభాయ్ స్టైల్, మేనరిజమ్ బాగా నచ్చి.. నిజజీవితంలో వాటిని అనుకరిస్తూ వచ్చాడు. తనకు తానే రోజూ రాకీభాయ్‌లా పోజులు కొడుతున్నాడు. నడక, స్టైల్, ఇలా అన్నింటిలో హీరోను ఫాలో అవుతున్నాడు.
ఇంతవరకు బాగానే ఉంది. కానీ.. ఆ కుర్రాడు అంతటితో ఆగకుండా.. ఇంకో అడుగు ముందుకేశాడు. ఆ సినిమాలో రాకీభాయ్ సిగరెట్లు తాగే స్టైల్ నచ్చి.. దాన్ని కూడా అనుకరించే ప్రయత్నం చేశాడు. అచ్చంగా అదే స్టైల్ రావటం కోసం మన కుర్రహీరో.. ఒకేసారి ఏకంగా ఓ ప్యాకెట్ సిగరెట్లు పీల్చేశాడు. కట్ చేస్తే.. ఆ స్టైల్ రావటం అటుంచింతే.. మనోడు చేసి ప్రయత్నం బెడిసికొట్టి.. ఆస్పత్రి బెడ్‌పై పడ్డాడు.
- ఇదీ చూడండి: ఇదో నయా ట్రెండ్.. హత్యల్లోనూ 'కేజీఎఫ్' మేనియా
హైదరాబాద్ రాజేంద్రనగర్‌కు చెందిన బాలుడు(15).. ఇటీవల థియేటర్లో 'కేజీఎఫ్-2' సినిమా చూశాడు. అందులో రాకీ భాయ్‌గా నటించిన యష్ నటన చూసి ఫుల్ ఫిదా అయ్యాడు. అందులో రాకీ మేనరిజమ్స్‌కు ప్రభావితమై.. ఈ ప్రయోగం చేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఒక ప్యాకెట్ సిగరెట్లు మొత్తం పీల్చేశాడు. ఆ కాసేపటికే తీవ్రంగా దగ్గు, గొంతు నొప్పి రావడంతో గుర్తించిన కుటుంబీకులు హూటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. బాధితుడికి చికిత్స అందించారు. ప్రాణాపాయం తప్పడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
పిల్లలు ఏం చేస్తున్నారనేది తల్లిదండ్రులు ఎల్లప్పుడూ పర్యవేక్షిస్తుండాలని వైద్యులు సూచిస్తున్నారు. సినిమాల్లో హీరోల క్యారెక్టర్లకు పిల్లలు సులభంగా ప్రభావితమవుతారని.. వాళ్లను ఎప్పుడూ ఓ కంట కనిపెట్టాలని చెబుతున్నారు. సినిమాల్లోని హీరోలను అనుకరిస్తూ.. మద్యం, ధూమపానానికి అలవాటు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టం జరిగాక పశ్చాత్తాప పడితే లాభం లేదని ముందే జాగ్రత్త పడాలంటున్నారు. సమాజంపై సినిమాలు మంచి ప్రభావం చూపితే పరవాలేదు కానీ.. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడే బాధపడాల్సిన పరిస్థితి వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: