వారం వ్యవధిలో ఇద్దరు చిన్నారులు.. ఆరు నెలల కాలంలో 8 మంది పసివాళ్లు, రెండేళ్లలో 14 మంది శిశువులు.. ఏపీలో విశాఖ మన్యంలోని పాత రూఢకోటలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల సంఖ్య ఇది. గిరిజనులుండే ఈ పల్లెలో చోటు చేసుకుంటున్న శిశుమరణాలు.. స్థానికుల్ని తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. నవమాసాలు మోసి జన్మనిచ్చిన కన్నబిడ్డలు.. కళ్లెదుటే గిలగిలా కొట్టుకుని చచ్చిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి ఏదో జరిగిందని.. అందుకే తమ పిల్లల ప్రాణాలు పోతున్నాయని ఆ అమాయకపు ఆదివాసులు వణికిపోతున్నారు.
నవ మాసాలు కడుపున మోసి కన్న పిల్లల ఎదుగుదల చూద్దామనే ఆశ తీరక ఆ గ్రామ మహిళలు.. మానసికంగా కుంగిపోతున్నారు. చిన్నారులను బలి తీసుకుంటున్న గ్రామంలో ఎందుకు ఉన్నామంటూ ఆవేదన చెందుతున్నారు. అంతు చిక్కని శిశుమరణాలతో భయం గుప్పిట్లో బతుకుతున్నారు. కొంతమంది మాత్రం.. తమ బిడ్డలను కాపాడుకోవాలన్న ఆశతో ఉంటున్న ఇళ్లకు తాళాలు వేసి గ్రామం విడిచి వెళ్తున్నారు. ఊరు మారితే అయినా.. కడుపున పుట్టిన బిడ్డలు క్షేమంగా ఉంటారన్న నమ్మకంతో పయణమవుతున్నారు. ఎన్ని ఇబ్బందులున్నా.. తమ పిల్లల ప్రాణాలు కాపాడుకోవటమే ముఖ్యమని కన్న పేగులు పరితపిస్తున్నాయి.
కడుపు నొప్పి, వాంతులు, ఊపిరి సమస్యతో చిన్నారులు మృత్యువాత పడుతున్నట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. గతంలో బాగానే ఉండేదని.. రెండేళ్లుగా శిశుమరణాలు నమోదవుతున్నాయని వాపోతున్నారు. స్కానింగ్, ఇతర వైద్య పరీక్ష ఫలితాలు సాధారణంగానే ఉన్నా.. పసివాళ్లు మృతి చెందుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూఢకోట ఆసుపత్రి వైద్యులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ మాత్రం చిన్నారుల మరణాలకు నాటు వైద్యం, పాలు సమయానికి ఇవ్వకపోవడం వంటి అంశాలు కారణం కావొచ్చని అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చూడండి: