11 people arrested in red sandalwood smuggling case ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో 11మందిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. తవుడు బస్తాల కింద ఎర్రచందనం దుంగలు పెట్టి రవాణా చేస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు.. దాడి చేసి పట్టుకున్నారు. విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ జీఆర్ రాధిక వివరాలు వెల్లడించారు.
శేషాచలం అడవుల నుంచి దొంగిలించి.. ఒడిశాలో భద్రపరిచిన ఎర్రచందనాన్ని విదేశాలకు ఎగుమతి చేయాలని ముఠా ప్రయత్నిస్తుండగా గుట్టురట్టయిందన్నారు. ఒడిశా రాష్ట్ర సరిహద్దు గ్రామమైన ఎస్. పైలం నుంచి 5వ తేదీ రాత్రి బయలుదేరి చెన్నైకి తీసుకెళ్లేందుకు వీరు పథకం వేసినట్లు గుర్తించారు.
4.20టన్నుల బరువైన 404 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.2.10కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. ఈ కేసులో ఎర్రచందనం రవాణా చేస్తున్న ఐచర్ వ్యానుతోపాటుగా.. ఎస్కార్టు వాహనాలుగా వెళ్తున్న రెండు కార్లను రూ.35వేలు నగదు, 14 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటిని విక్రయించిన ఒడిశా వాసి శామ్యూల్ పరారీలో ఉండగా 11మందిని అరెస్టు చేసి రిమాండుకు తరలించామని వెల్లడించారు. మెుత్తం 15మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అరెస్టయిన వారిలో ఓ మహిళ ఉందన్నారు. నిందితుల్లో ఏ1 గా ఉన్న వీరాస్వామి కోదండన్పై చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో 11 కేసులు ఉన్నాయని, ఏ2గా ఉన్న అబ్బారావు సోమినాయుడుపై ఏడు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను పట్టుకున్న పోలీసు సిబ్బందిని ఎస్పీ జీఆర్ రాధిక అభినందించారు.
ఇవీ చదవండి: