దేశ రక్షణకు సరిహద్దుల్లో ప్రతిక్షణం కాపలా కాసే ఆర్మీ జవాన్ల పేరు వినగానే సహజంగానే ప్రతి భారతీయుడి ఛాతీ విస్తరిస్తుంది. అలా దేశానికి సేవ చేస్తూ వీరోచితమైన జీవితాన్ని గడపాలని కోరుకునే యువకులకు ఇండియన్ ఆర్మీ పలు రకాల అవకాశాలు కల్పిస్తోంది. అందులో ఒకటి 10 + 2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్. ఇంటర్మీడియట్ అర్హతతో ఇందులోకి ప్రవేశిస్తే ఇంజినీరింగ్ విద్యను ఉచితంగా అందించడంతోపాటు మంచి జీతంతో ఉద్యోగంలోకీ తీసుకుంటారు. అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన వారికి 45వ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సులోకి ప్రవేశం కల్పిస్తారు. దీన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంటే ఆర్మీ శిక్షణతోపాటు ఇంజినీరింగ్ డిగ్రీ, ఉద్యోగం అందుతాయి. ఎలాంటి రాత పరీక్ష లేదు.
ఇదీ అర్హత
దరఖాస్తుదారుల వయసు 16 1/2 నుంచి 19 1/2 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే జనవరి 2, 2003 తర్వాత.. జనవరి 1, 2006కు ముందు జన్మించాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాల నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల్లో 70 శాతం మార్కులతో 10+2/ తత్సమాన పరీక్షలో అర్హత సాధించాలి. అభ్యర్థులకు దేహదార్ఢ్య, వైద్య పరీక్షలుంటాయి.
దరఖాస్తు విధానం
ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 23, 2022
ఎంపిక ఎలా?
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్లిస్టింగ్ చేసి ఎస్ఎస్బీ ఇంటర్వ్యూకి పిలుస్తారు. అలహాబాద్, భోపాల్, బెంగళూరు, కపూర్తలా (పంజాబ్) నగరాల్లో సైకాలజిస్ట్, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్, ఇంటర్వ్యూ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఈ ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఇక్కడ అభ్యర్థులను రెండు దశల్లో ఎంపిక చేస్తారు. మొదటి దశలో అర్హత సాధించిన వారినే రెండో దశలోకి తీసుకుంటారు. మొదటి దశలో విఫలమైన అభ్యర్థులు అదే రోజు ఇంటికి వెళ్లిపోవాల్సి ఉంటుంది. రెండో దశకు ఎంపికైన వారికి అయిదు రోజులపాటు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులోనూ అర్హత సాధిస్తే వైద్య పరీక్షలు జరిపి కోర్సులోకి తీసుకుంటారు.
జీతభత్యాలు.. పదోన్నతులు
అభ్యర్థులు లెఫ్టినెంట్ అధికారిగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత కెప్టెన్ హోదా పొందుతారు. ఆరేళ్లకు మేజర్, 13 ఏళ్లకు లెఫ్టినెంట్ కల్నల్, 26 ఏళ్లకు కల్నల్గా పదోన్నతి లభిస్తుంది. ఆ తర్వాత పని తీరును బట్టి పదోన్నతులుంటాయి. లెఫ్టినెంట్కు లెవల్ 10 పేకమిషన్ కింద రూ.56,100 నుంచి 1,77,500 వరకు వస్తాయి. గరిష్ఠంగా లెవల్ 18 పేకమిషన్ కింద రూ.2,50,000 వరకు అందుకోవచ్చు. ఇది సైన్యంలో అత్యున్నతమైన హోదాలో ఉన్న అధికారికి లభిస్తుంది. జీతంతో పాటు ఇతర అలవెన్సులూ ఉంటాయి.
కోర్సుకు ఎంపికైతే..
అయిదేళ్లపాటు శిక్షణ ఉంటుంది. మొదటి సంవత్సరం ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ(గయా)లో బేసిక్ మిలటరీ శిక్షణ ఇస్తారు. తర్వాత టెక్నికల్ ట్రెయినింగ్ నాలుగేళ్లపాటు ఉంటుంది. ఇందులో ఫేజ్ 1లో మూడేళ్లు ప్రీ కమిషన్ ట్రెయినింగ్, ఫేజ్ 2లో ఏడాది పోస్టు కమిషన్ ట్రెయినింగ్ ఇస్తారు. ఈ శిక్షణను కాలేజీ ఆఫ్ మిలటరీ ఇంజినీరింగ్ (పుణె), మిలటరీ కాలేజ్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (మౌ), మిలటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ (సికింద్రాబాద్)లో ఎక్కడైనా ఇవ్వవచ్చు. శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత అభ్యర్థులు ఇంజినీరింగ్ డిగ్రీ పట్టా పొందుతారు.