ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్ల అమలు ప్రక్రియ ప్రారంభమైంది. టీఎస్‌పీఎస్సీ ఇటీవల జారీ చేసిన వ్యవసాయ, వెటర్నరీ వర్సిటీల్లోని జూనియర్, సీనియర్ అసిస్టెంట్, టైపిస్టు కేటగిరీలో 127 పోస్టుల భర్తీలో ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి రిజర్వేషన్లు పేర్కొంది. మార్చి 31న జారీచేసిన ఉద్యోగ ప్రకటనకు (03/2021)కు కమిషన్ సవరణ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఆయా పోస్టులకు దరఖాస్తులు ఈనెల 19 నుంచి మే 20 వరకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయంది.
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాల్లో కేంద్ర మార్గదర్శకాల మేరకు ఈడబ్ల్యూఎస్ వర్గాలకు పదిశాతం రిజర్వేషన్లను అమలు చేసేందుకు ప్రభుత్వం ఫిబ్రవరి 8న ఉత్తర్వులు జారీ చేసింది. రిజర్వేషన్ల నిబంధనలు, విధివిధానాలపై సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేస్తుందని పేర్కొంది. మార్చి 19న సాధారణ పరిపాలనశాఖ రిజర్వేషన్ల విధానంలో సవరణలు చేస్తూ ఇచ్చిన జీవో నం.65 ఇటీవల టీఎస్‌పీఎస్సీకి చేరింది. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జారీచేసే ప్రకటనల్లో పదిశాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించింది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తులో వివరాలు సమగ్రంగా పూర్తిచేయాలని కమిషన్ ముఖ్య కార్యదర్శి వాణిప్రసాద్ సూచించారు.
ఇదీ చదవండి: ఆర్థిక సంఘం నియమాల అమలుకు కసరత్తు