వచ్చే విద్యా సంవత్సరానికి(2021-22) వివిధ ఉన్నత విద్యా కోర్సుల్లో తొలిసారిగా ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్న నేపథ్యంలో ఈసారి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియలోనే కొత్తగా ఈడబ్ల్యూఎస్ కాలమ్‌ను చేర్చారు. ఇటీవలే పలు నోటిఫికేషన్లు వెలువడగా గత పది, పదిహేను రోజులుగా దరఖాస్తుల సమర్పణ ప్రక్రియ మొదలైంది. ఇప్పటివరకు అందిన దరఖాస్తులను పరిశీలిస్తే సగటున 30 శాతం కొత్త కోటా వారు ఉంటున్నట్లు స్పష్టమవుతోంది.
ఎంసెట్‌కు ఆ శాతం పెరుగుతుందా?
ఎంసెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ దరఖాస్తుల ప్రక్రియ మార్చి 20 నుంచి మొదలైంది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం హాల్‌టికెట్లను ఇంటర్‌బోర్డు ఇంకా జారీ చేయలేదు. దీంతో ప్రస్తుతం పాలిటెక్నిక్, బీఎస్‌సీ గణితం విద్యార్థులతోపాటు గతంలో ఇంటర్ పాసైన వారు మాత్రమే దరఖాస్తు చేస్తున్నారు. ఎంసెట్‌కు బుధవారం నాటికి మొత్తం 4,511 మంది దరఖాస్తు చేశారు. అందులో ఓసీల్లో ఈడబ్ల్యూఎస్ దరఖాస్తులు 27.60% ఉన్నాయి. కొత్త విద్యార్థులు దరఖాస్తు చేయడం మొదలైతే ఆ శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
ఇప్పుడు టిక్ చేస్తే చాలు
దరఖాస్తు చేసే సమయంలో కేవలం ఈడబ్ల్యూఎస్ తమకు వర్తిస్తుందని టిక్ చేస్తే చాలు. ఇప్పుడే ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని కన్వీనర్లు చెబుతున్నారు. అయితే ఫలితాల విడుదల నాటికి అభ్యర్థులు సర్టిఫికెట్‌ను అప్‌లోడ్ చేయాలా? లేక ప్రవేశాల కౌన్సెలింగ్ సందర్భంగా ఇస్తే చాలా అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. జేఈఈ మెయిన్‌లో జనరల్ విభాగంతోపాటు ఈడబ్ల్యూఎస్ విభాగం ర్యాంకు కూడా కేటాయిస్తున్నారు. ఎంసెట్‌లో ఎలా చేస్తారన్న దానిపై కన్వీనర్ ఆచార్య గోవర్ధన్ మాట్లాడుతూ అవకాశం ఉంటే తామూ జేఈఈ మెయిన్ తరహాలోనే చేస్తామని తెలిపారు.
- ఇదీ చదవండి : రోజుకు లక్ష మందికి కొవిడ్ వ్యాక్సిన్: డీహెచ్