తెలంగాణ శాసనసభ రద్దైన మూడు నెలల తర్వాత ఎన్నికలు జరిగాయి. అదే రోజు అభ్యర్థులను ప్రకటించిన గులాబీ అధినేత విజయవంతమయ్యారు. అభ్యర్థులను ప్రకటించడంలో కాంగ్రెస్ ఆలస్యం చేసింది. ప్రచారం చేసుకునేందుకు సమయం సరిపోలేదు. ఫలితాలతో ఖంగుతిన్న హస్తం పార్టీ రాబోయే సార్వత్రిక పోరుకు ముందుగానే మేల్కొన్నట్లు కన్పిస్తోంది.
అభ్యర్థుల కోసం ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. బలాబలాలు, నియోజకవర్గ పరిస్థితులు, ఆర్థిక, సామాజిక అంశాల ఆధారంగా జాబితా తయారు చేసి పంపాలని అధిష్ఠానం ఆదేశించింది. నెలాఖరు వరకు అర్జీలు పరిశీలించి జాబితాను సిద్ధం చేసేందుకు కసరత్తు చేస్తోంది.
అభ్యర్థుల జాబితా ప్రకటన అనంతరం... ప్రజల్లోకి వెళ్లేలా ప్రణాళికలు రచిస్తోంది హస్తం పార్టీ.