కుమురంభీమ్ జిల్లా కాగజ్‌నగర్ మండలం చింతగూడ కోయవాగులో సుమారు 500 మందికి ఫర్నిచర్ తయారీయే జీవనాధారం. కాగజ్ నగర్ పట్టణంలోని సర్ సిల్క్ పరిశ్రమ మూతపడడం వల్ల వారు ఉపాధి కోల్పోయారు. ఏం చేయలేని స్థితిలో స్థానిక అడవి నుంచి కలప తెచ్చి ఫర్నీచర్ చేసి అమ్ముకుంటున్నారు. మంచాలు, కుర్చీలు, మెజా బల్లలు చేయడం జీవనోపాధిగా మార్చుకున్నారు.
కలప స్మగ్లింగ్ ప్రారంభం
సమీప అటవీ ప్రాంతంలో కలప తగ్గిపోవడం వల్ల మహారాష్ట్ర సరిహద్దులోని కలప స్మగ్లర్ల నుంచి టేకు కలప కొనుగోలు చేసి దొంగచాటుగా వ్యాపారం చేసేవారు. ఎంత జాగ్రత్తగా వ్యాపారం చేసినా ఎప్పుడో ఒకసారి అధికారుల సోదాల్లో పట్టుబడేవారు. కలపను సీజ్ చేసి కేసులు కూడా నమోదు చేయడం జరిగేది.
కలప అక్రమ రవాణాపై దృష్టి
ఇటీవల కాగజ్‌నగర్ డివిజన్‌కి కొత్తగా వచ్చిన అటవీశాఖ అధికారి రాజా రమణారెడ్డి కలప అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎప్పటికప్పుడు సోదాలు చేసి లక్షల విలువచేసే టేకు కలప స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఫర్నిచర్ తయారీదారులతో రమణారెడ్డి చర్చలు జరిపారు. అక్రమ కలప వ్యాపారం చేయడం వల్ల జరిగే అనర్థాలను వారికి వివరించారు. అడవులు అంతరించిపోతే నష్టం జరుగుతుందని చెప్పారు. చట్టపరంగా టేకు కలప ఎలా కొనుగోలు చేయాలో తెలిపారు.
అధికారుల వరుస దాడులతో ఇన్ని సంవత్సరాలు పడిన శ్రమ ఒక్కసారిగా బూడిద పాలు అవుతుందని వారు ఆలోచనలో పడ్డారు. జీవనాధారమైన వృత్తిని వదులుకోలేక చట్ట వ్యతిరేకమైన పని చేస్తూ నష్టాల బారిన పడలేక తర్జనభర్జనకు లోనయ్యారు. చివరికి చట్ట పరంగా కలప కొనుగోలు చేసి వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నారు.
గతంలో అడపాదడపా సోదాలు చేయడం... కలప స్వాధీనం చేసుకొని కేసులు పెట్టడం జరిగేదని.. కానీ కొత్తగా వచ్చిన అధికారి రాజా రమణారెడ్డి తమ బాధలను గుర్తించి తాము చట్టపరంగా కలప వ్యాపారం చేసుకునేందుకు దారి చూపెట్టాడని.. ఆ అధికారి వల్ల తాము ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
అధికారి చొరవ, కలప వ్యాపారుల్లో మార్పు రెండు కలిసి చట్టపరిధిలో వ్యాపారం చేసుకునేందుకు కారణమయ్యాయి. చాలా మంది పొరపాట్లు చేస్తుంటారు. వాటిని చక్కదిద్దికుని సరైన మార్గంలో నడిచే వారు కొందరే ఉంటారు.
ఇవీ చూడండి: స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ గురి