Arms Transport to Adilabad : హరియాణాలో ఉగ్రవాదులు భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలతో పట్టుబడిన వ్యవహారంలో ఆదిలాబాద్ పేరు ప్రస్తావనకు రావటం కలకలం రేపింది. ఆదిలాబాద్ జిల్లాకు ముష్కరులు ఆయుధాలు సరఫరా చేస్తున్నట్లు హరియాణా హోంమంత్రి వెల్లడించడం ప్రకంపనలు సృష్టించింది. జాతీయ దర్యాప్తు సంస్థ మూడు రోజుల క్రితమే రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులకు సమాచారమివ్వగా.. ఉమ్మడి జిల్లా పోలీసులను అప్రమత్తం చేసినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది.
Terrorists Smuggled Arms to Adilabad : హరియాణాలోని కర్నాల్ జిల్లా పస్తారా టోల్ ప్లాజా వద్ద పట్టుబడిన కుల్‌ప్రీత్, అమన్‌దీప్, పరిమిందర్, భూపేందర్‌కు పాకిస్తాన్‌లోని ఖలిస్తాన్ ఉగ్రవాది హరివిందర్‌సింగ్‌తో సత్సంబంధాలున్నట్లు ఎన్‌ఐబీ తేల్చింది. నాందేడ్, ఆదిలాబాద్ జిల్లాల్లో పేలుడు పదార్థాలు, ఆయుధాలను డంప్ చేసుకునేందుకు ఎంచుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధరించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రశాంతంగా ఉండటమే కాకుండా.. ఎవరికీ అనుమానాలకు ఆస్కారముండదనే కారణంతోనే పేలుడు పదార్థాల నిలువకు అనువైన స్థావరంగా ఎంచుకొని ఉంటారనేది ప్రాథమికంగా నిర్ధరించారు.
Terror Tension in Adilabad : ఈ వ్యవహారంలో మూడు ప్రధాన అంశాలపై మూడురోజులుగా పోలీసులు ఆరాతీసినట్లు తెలుస్తోంది. ఒకటి ఆదిలాబాద్ జిల్లా మీదుగా 44 నంబర్ జాతీయ రహదారి ద్వారా దిల్లీకి చేరుకోవడం.. రెండోది నిర్మల్ జిల్లా భైంసా, నాందేడ్‌కు వెళ్లి అక్కడి నుంచి దిల్లీకి చేరేందుకు అనువైన మార్గం కావడం.. మూడోది మంచిర్యాల మీదుగా నేరుగా దిల్లీకి రైల్వే మార్గం ఉండటం. అందుకనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆర్డీఎక్స్‌తో పాటు ఆయుధాలను నిలువచేసి ఉంచుకోవచ్చనే ఆలోచన ఖలిస్తాన్ ఉగ్రవాదులు ఎంచుకొని ఉండవచ్చని పోలీసువర్గాలు భావిస్తున్నట్లు సమాచారం.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నతాధికారులంతా మంచిర్యాల, ఆదిలాబాద్, కాగజ్‌నగర్, నిర్మల్ ప్రాంతాలతో పాటు దాబాల వద్ద... ఎవరికీ అనుమానం రాకుండా కొత్త వ్యక్తుల కదలికలను ఆరాతీస్తున్నారు. జాతీయ, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు వేర్వేరేగా ఐఎస్‌ఐ తీవ్రవాదంపై ఆరాతీస్తున్నాయి. పాకిస్తాన్‌లో ఉన్న ఖలిస్థాన్ ఉగ్రవాది హరివిందర్‌సింగ్‌తో ఎలాంటి సంబంధాలున్నాయనే కోణంలోనూ అంతర్గతంగా రహాస్య దర్యాప్తు కొనసాగుతోంది గతంలో హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్‌కు సాధారణ వ్యక్తులుగా వచ్చి ఇక్కడి నుంచి దిల్లీ మీదుగా ఇస్లామిక్ తీవ్రవాదుల్లో చేరడానికి కొంతమంది సానుభూతిపరులు సాయం చేసినట్టు నిఘా వర్గాల దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఖలిస్తాన్, ఐఎస్‌ఐ తీవ్రవాదులకు ఈ ప్రాంతంవారితో ఏమైనా సంబంధాలు ఉన్నాయా..? అనే అంశంపై మరింత లోతుగా ఆరాతీస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఇవీ చూడండి: