Basara IIIT News: బాసర ఆర్జీయూకేటీలో పీయూసీ-2 చదువుతూ అనారోగ్యంతో మరణించిన విద్యార్థి సంజయ్‌కిరణ్ ఆరోగ్య బీమా సొమ్ము చెల్లించినప్పటికీ ఇన్సూరెన్స్ అమలుకాలేదు. దీనిపై తల్లిదండ్రుల కమిటీ అధికారులకు ఫిర్యాదు చేయగా.. బీమా సొమ్ము ప్రీమియం చెల్లించలేదని వారి విచారణలో వెలుగులోకి వచ్చింది. ఆర్జీయూకేటీలో ఏటా 1500 మంది విద్యార్థులు పీయూసీ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు పొందుతారు. ఆ సమయంలో ఆరోగ్యబీమా కోసం ఒక్కొక్కరు రూ.700 చొప్పున చెల్లిస్తారు. ఇలా సుమారు రూ.10.50 లక్షలు వసూలైంది. కానీ ఈసారి బీమా ప్రీమియం ఎందుకు చెల్లించలేదో ఎవరికీ తెలియడం లేదు.
విద్యార్థికి పరిహారం అందేనా... ఇటీవల మరణించిన విద్యార్థి సంజయ్‌కిరణ్ నిరుపేద కుటుంబానికి చెందినవాడు. ఆసుపత్రిలో చేరిన తమబిడ్డను ఎలాగైనా రక్షించుకోవాలని అతని తల్లిదండ్రులు అప్పు చేసి రూ.16 లక్షలు ఖర్చు చేశారు. కానీ ఫలితం లేకపోయింది. ఈక్రమంలో శుక్రవారం తల్లిదండ్రుల కమిటీ అధ్యక్షురాలు రాజేశ్వరి మాట్లాడుతూ విద్యార్థికి బీమా డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ఆర్జీయూకేటీ ఇన్‌ఛార్జి ఉపకులపతి వెంకటరమణ మాట్లాడుతూ ఆర్జీయూకేటీలో బీమా విషయమై పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. బీమా డబ్బులు వసూలు చేసినా.. ఎందుకు ప్రీమియం చెల్లించలేదో తెలుసుకుంటామని చెప్పారు. సోమవారం విద్యాలయంలో పలు బీమా సంస్థల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటుచేసి చర్చిస్తామన్నారు. విద్యార్థులు చెల్లించిన ప్రీమియం డబ్బులు విద్యాలయం ఖాతాలోనే ఉన్నాయని స్పష్టం చేశారు.