problems of tribal pregnant women: ఇప్పటికీ ఏజెన్సీల్లోని మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేక ప్రజలతోపాటు, గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలోని నర్సాపూర్, వంక తుమ్మ ,కుమ్మరి కుంట, పాట గూడెం, రాజులు గూడెం, రాజుల మడుగుతో పాటు పలు గ్రామాలకు రహదారి లేక ప్రజలు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం.
అందులోనూ గర్భిణీల కష్టం ఆ దేవుడికే ఎరుక. ప్రసవ సమయంలో సరైన రోడ్డు సదుపాయం లేని ప్రాంతంలో వారి ఇక్కట్లు ఏమని వర్ణించగలం. వైద్యం కోసం ఆ ప్రాంత ప్రజలు ఎన్నో అవరోధాలను ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో వర్షాలు ఏకధాటిగా కురవడం వల్ల వాగులు ఉప్పొంగి మారుమూల గ్రామాలకు కాలినడకన వెళ్లేందుకు కష్టంగా మారుతోంది. గర్భిణీలు ప్రతి మాసం వైద్య పరీక్షలు చేసుకునేందుకు ప్రభుత్వ ఆస్పత్రులు వెళ్లడానికి నానా తంటాలు పడుతున్నారు. రోడ్లు బాగా లేక గర్భిణీలు కిలోమీటర్ల కొద్దీ కాలినడకన రావాల్సిన దుస్థితి నెలకొంది.
కాలినడకన ఆసుపత్రులకు.. ఉట్నూరు మండలం జెండాగూడెం, నర్సాపూర్ గ్రామాలకు చెందిన గర్భిణీలు కాలినడకన వాగులు వంకలు దాటుతూ ఆ ఆస్పత్రులకు చేరుకుంటున్నారు. తాజాగా ఉట్నూరు మండలం రాజులగూడెం చెందిన ఆదివాసి మహిళ చాకట్ లక్ష్మీబాయి ఈనెల 26న ప్రసవం కావాల్సింది. విషయం తెలుసుకున్న హస్నాపూర్ వైద్య సిబ్బంది అతి కష్టం మీద రాజులగూడెంకు చేరుకున్నారు. అక్కడి నుంచి పాటగూడెం వరకు రోడ్డు సౌకర్యం లేక ఆమెను రెండు కిలోమీటర్లు కాలినడకన ఆ ప్రాంతం వరకు తీసుకొని వెళ్లారు.
వైద్య సిబ్బంది ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి గర్భిణీని ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎన్నో ఇబ్బందులు పడుతున్న ఆదివాసిగూడెంల ఏజెన్సీలోని, మారుమూల ఆదివాసిగూడెంలకు రోడ్డు సౌకర్యాలు లేక గర్భిణీ మహిళలు ఎన్నో అవస్థలు పడుతున్నారు. వైద్యం కోసం ఆ ప్రాంత ప్రజలు వాగులు వంకలు దాటుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు ఆయా గ్రామాలకు కనీస రోడ్డు సౌకర్యాలు కల్పించాలని ఆదివాసీ గూడెం ప్రజలు కోరుకుంటున్నారు.