ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం సట్వాజీగూడకి చెందిన సోన్‌కాంబ్లే రమాదేవి-దేవిదాస్ దంపతులు ప్రజావాణిలో కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎదుట తమ గోడును వినిపిస్తూ బోరున విలపించారు. కులపెద్దల వేధింపులతో మానసిక వేదనకు గురై తమ కొడుకు మృతి చెందాడని... తమకు న్యాయం చేయాలని ఆ దంపతులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
కులపెద్దల ఒత్తిడికి తలొగ్గిన ఎస్ఐ తమను మూడు రోజుల పాటు స్టేషన్ పిలిపించి రాత్రి 10గంటలకు పంపడంతో ఆ అవమాన భారంతో తమ కుమారుడు చనిపోయాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఒక్కగానొక కొడుకు మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆలాగే తమను గ్రామం వదిలి వెళ్లాలని బెదిరిస్తున్నారని వాపోయారు. న్యాయం చేయాలని విన్నవించగా.. కలెక్టర్.. ఎస్పీకి చెబుతామని పేర్కొనడంతో వెనుదిరిగారు.
'సమాజ్ వాళ్ల డబ్బులు రూ. 2 లక్షలు జమ ఉండే... నా కొడుకు అందులో పదివేలు అప్పు అడిగితే ఇవ్వలేదు. అందరినీ మీటింగ్‌కి కూర్చోపెట్టినప్పుడు నా కొడుకు మీరు అన్ని పైసలు తీసుకుంటున్నారు. నాకెందుకు ఇవ్వరని తిట్టిండు. అది రికార్డింగ్ చేసి నా కొడుకును పోలీస్‌స్టేషన్‌లో పెట్టినారు. ఎస్ఐ మా ముగ్గురిని 7 గంటలకు తీసుకెళ్లి 10 గంటలకు వదిలేశాడు. మూడు రోజులు టార్చర్ పెట్టారు. నాకు న్యాయం కావాలి. 23 మందిని అరెస్టు చేయాలి. నేను ఎవ్వరి కోసం బతకాలి. లక్ష రూపాయలు ఇస్తం ఊర్లో నుంచి వెళ్లిపోమంటున్నారు. నేను ఎక్కడికి వెళ్లిపోవాలి.'- రమాదేవి, తల్లి
ఇవీ చదవండి:బర్త్‌డే పేరుతో.. 12 ఏళ్ల బాలికకు 35 ఏళ్ల వ్యక్తితో పెళ్లి