Adilabad library: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అర్ధశతాబ్దపు చరిత్ర కలిగిన కేంద్ర గ్రంథాలయంలో నెలకొన్న సమస్యలపై ఈటీవీ- ఈటీవీ భారత్లో ప్రసారం చేసిన కథనానికి ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న, పురపాలక అధ్యక్షుడు జోగు ప్రేమేందర్‌లు స్పందించారు. గ్రంథాలయానికి వచ్చి ఉద్యోగార్థుల సమస్యలను తెలుసుకున్నారు. వారం రోజుల్లోగా అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
గ్రంథాలయంలో వసతులు సహా ఇతర సమస్యలపై ఉద్యోగార్థుల ఆవేదనను ఈటీవీ- ఈటీవీ భారత్ కథనాలు ప్రసారం చేశాయి. ఉద్యోగ నోటిఫికేషన్ల నేపథ్యంలో గ్రంథాలయానికి వచ్చే పాఠకుల సంఖ్య పెరగడం, అందుకు సరిపడా సౌకర్యాలు లేని వైనంపై అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కూర్చోవడానికి కనీసం కుర్చీలైనా సమకూర్చాలని కోరారు. అంతేకాకుండా వేసవి దృష్ట్యా చలివేంద్రం ఏర్పాటు చేయాలని విన్నవించారు. బెంచీలు లేక కిందే భోజనం చేస్తున్న తీరును ఈటీవీ- ఈటీవీ భారత్ కథనం వెలుగులోకి తీసుకువచ్చింది.
స్పందించిన ఎమ్మెల్యే జోగురామన్న రూ.25 వేల విలువైన 50 కుర్చీలను తెప్పించారు. చల్లటి నీటి కోసం రంజన్లను సమకూర్చారు. వాటిని ఉద్యోగార్థుల సమక్షంలో గ్రంథాలయ అధికారులకు అప్పజెప్పారు. పాఠకుల సమస్యను అడిగి తెలుసుకున్నారు. పల్లె ప్రాంతాల నుంచి అభ్యర్థులు టిఫిన్లు తెచ్చుకుంటున్నారని.. ఒక్కోసారి ఆకలితో అలమటిస్తున్నారని తెలుసుకున్న ఎమ్మెల్యే.. ఏప్రిల్ ఒకటో తేది నుంచి మధ్యాహ్న భోజనం ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. జోగు ఫౌండేషన్ ద్వారా పోలీస్, టెట్ పరీక్ష కోసం సన్నద్ధమయ్యే వారికి భోజన, వసతితో కూడిన ఉచిత శిక్షణ ఇస్తామని వెల్లడించారు.
సమస్యల పరిష్కారంపై ఈటీవీ-ఈటీవీ భారత్ చొరవతో సౌకర్యాలు కల్పించడంపై పాఠకులు హర్షం వ్యక్తంచేశారు. దాతలకు, ఈటీవీ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీచూడండి: పుస్తకాలు, కుర్చీలు తెచ్చుకుని... అవస్థలు పడుతూ...