అదిలాబాద్ జిల్లా పేరు చెప్తేనే.. ఇంద్రవెల్లి అమరత్వం గుర్తుకు వస్తుంది. ప్రతీ ఏటా ఇంద్రవెల్లి కొండల్లో నిర్వహించే అమరవీరుల సంస్మరణ సభకు ఆదివాసీలు, గిరిజనులు, ఉద్యమకారులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఈ ఏడాది కరోనా వ్యాప్తి, లాక్డౌన్ కారణంగా ప్రభుత్వ సూచన మేరకు ఇంద్రవెల్లి సంస్మరణ సభను ఆదివాసీ గిరిజనులు అతి కొద్దిమందితో మాత్రమే నిర్వహించనున్నారు.
1981 ఏప్రిల్ 20న ఇంద్రవెల్లిలో జరిగిన పోలీసు కాల్పుల్లో 13 మంది మృతి చెందారని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి ఆ కాల్పుల్లో వందలాది మంది మృతి చెందగా..లెక్కలేనంత మంది గాయపడ్డారు. 1983లో ఇంద్రవెల్లి సామాజిక కార్యకర్తలు ఈ అమర వీరుల స్థూపాన్ని నిర్మించారు .1986లో గుర్తుతెలియని వ్యక్తులు స్థూపాన్ని కూల్చివేయగా.. గిరిజనుల కోరిక మేరకు ప్రభుత్వం ఐటీడీఏ ద్వారా 1987లో పునర్నిర్మాణం చేసింది. ప్రతీ ఏటా ఘనంగా నిర్వహించే ఇంద్రవెల్లి సంస్మరణ సభకు ఈ ఏడాదితో 39 ఏళ్లు పూర్తయ్యాయి. ఇంద్రవెల్లి కాల్పుల్లో అమరులైన మృతవీరుల సంస్మరణ కార్యక్రమాన్ని ఈసారి కేవలం 10 మంది గిరిజన, ఆదివాసీ నాయకులతో నిర్వహించనునట్లు ఆదివాసీ మృతవీరుల సంస్మరణ కమిటీ సభ్యులు తెలిపారు. గిరిజన నాయకులు, ఆదివాసీ గిరిజనులు వారి వారి గూడెంలోని ఇళ్లలోనే అమరవీరుల సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో 800 మార్కు దాటిన కరోనా కేసులు