అటవీ శాఖ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న వాగు పక్కనే కలప స్మగ్లర్లు అక్రమంగా కలప దందా చేస్తున్నా.. అటవీ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారంటున్నారు జైనూర్ మండల ప్రజలు. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా మండల కేంద్రంలో కొనసాగుతున్న అక్రమ కలప దందా గుట్టు రట్టయింది. గత కొద్ది నెలలుగా కలప స్మగ్లర్లు స్థావరం ఏర్పాటు చేసుకొని దందా చేస్తున్నారు.
ఏపుగా పెరిగిన అడవి గడ్డిలో కలప కోయడానికి ఉపయోగించే విద్యుత్ రంపం, పెద్ద ఎత్తున కలప దాచి ఉంచారు స్మగ్లర్లు. ఈ విషయమై అటవీ అధికారులైన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గులాబ్ సింగ్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ విజయలను ప్రశ్నించగా స్మగ్లర్లపై చర్యలు తీసుకుంటామని చెప్పి మాట దాటవేశారు. అటవీ శాఖ కార్యాలయానికి కూతవేటు దూరంలో పెద్ద ఎత్తున అక్రమ కలప దందా జరుగుతున్నా అధికారులు తమకు తెలియదనడం పలు అనుమానాలకు తావిస్తోంది.
కొత్తగా నిర్మాణాలు చేపట్టే వారి దగ్గరకు వెళ్లి ఇంటి నిర్మాణానికి తలుపులు, కిటికీల కోసం కలప ఎక్కడి నుంచి తెచ్చారు. మామూళ్లు ఇవ్వకపోతే కేసులే.. అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నట్టు జైనూర్ మండల అటవీ అధికారుల మీద పలు ఆరోపణలున్నాయి. ఈ విషయాలపై ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డిని వివరణ కోరగా.. మా దృష్టికి ఇలాంటివి రాలేదని, ఒకవేళ దృష్టికి వస్తే ఎంతటివారినైనా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: బాణసంచా పరిశ్రమలో పేలుడు-ఆరుగురు మృతి